మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వ్యవహారిక భాషకు విశేష ప్రాచుర్యం కల్పించిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు తల్లిని స్మరించుకుంటూ గౌరవ వందనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీకోసం సమావేశం మందిరంలో జ్యోతి ప్రజ్వలన గావించి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వ్యవహారిక భాషకు విశేష ప్రజాదరణ కల్పించుట కోసం ఉద్యమించిన పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు చిరస్మరణీయులని వారి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. తెలుగు భాష ఎంతో మధురమైనది, కమ్మనైనది అంటూ గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజేపిన మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. భారతీయ భాషల్లో కెల్లా తెలుగు భాషకు ఎంతో గొప్పతనం ఉందని దాని యొక్క పదజాలమే అందుకు కారణమన్నారు.
ఆంగ్ల భాషలో రెండు మూడు అర్థాలు ఉండే భావజాలానికి ఒకటే పదం ఉంటుందని అదే తెలుగు భాషలో ప్రతి ఒక్క భావజాలానికి ఒక పదం ఉంటుందని సోదాహరణంగా అమ్మ,పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త తదితర పేర్లతో వివరించారు. మన పూర్వీకులు అన్ని విధాల ఆలోచించి ప్రతి ఒక్క భావజాలానికి తగినట్టుగా పదాలను పొందు పరచారన్నారు. మన భాష పై ఆంగ్ల భాష పెత్తనం అవసరం లేదన్నారు . ఆంగ్ల భాష రాని తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో కొద్దిగా ఆంగ్ల భాష మాట్లాడగానే . ఉబ్బి తబ్బిబ్భు అయిపోతున్నారని నిజానికి వారి పిల్లలకు ఆంగ్ల భాషలో కూడా పెద్దగా ప్రావీణ్యం లేకుండా పోతుందన్నారు మాతృభాష అయిన తెలుగుపై పట్టు, జ్ఞానం శ్రద్ధగా సంపాదిస్తే ఇతర భాషలన్నీ కూడా సులభంగా నేర్చుకోగలుగుతామన్నారు. పిల్లలకు చిన్నప్పటినుండే తెలుగు భాష పైన మమకారము పెంచడంతోపాటు పట్టు సాధించే విధంగా తల్లిదండ్రులు కీలకంగా వ్యవహరించాలన్నారు. తెలుగు భాష ఎంతో గొప్పదని దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కీర్తించారన్నారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా కూడా తెలుగు భాష ఎంతో వినుతికెక్కిందన్నారు. అంతర్జాతీయంగా కూడా తెలుగు భాష గొప్పదనం గురించి యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉందన్నారు. ప్రతి తెలుగు వారికి తెలుగు భాష చాలా భావోద్వేగ పూరితమైనదన్నారు. దేశంలో 2000 సంవత్సరాల కిందటీ అతి ప్రాచీనమైన భాషలలో 6 వ స్థానంలో తెలుగు భాష ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక ప్రపంచంలో కంప్యూటర్, పెన్ డ్రైవ్, సిడి వంటి కొత్త సాంకేతిక పదాలకు సరిపోయే తెలుగు పదాల ఆవిష్కరణలు అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా తెలుగు పండితులు కవులు దృష్టి సారించాలన్నారు.
ఆంగ్ల భాషలోని సాంకేతిక పదాలకు తెలుగు పదాలతో తెలుగు పద కోశం సిద్ధం చేస్తే పుస్తకాల తయారీకి అవసరమైన నిధులను సమకూరుస్తానన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగు భాష సుసంపన్నం చేస్తుంటే మన దేశంలో నిరాదరణకు గురవుతుండడం బాధాకరమని తెలుగు భాషను పాలన భాషగా అమలు చేయాలని కోరుతూ భాషా పండితులు, కవులు జిల్లా కలెక్టర్ కు మహజరు అందజేశారు. తదనంతరం తెలుగు కవులు, రచయితలు, భాషాభిమానులైన గుత్తికొండ సుబ్బారావు, చింతలపాటి మురళీకృష్ణ, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ఎంవిసి ఆంజనేయులు, ఎండి సిలార్, పన్యారం సాంబశివరావు, ముదిగొండ శాస్త్రి, అంబటీపూడి సుబ్రహ్మణ్యం, కారుమూరి రాజేంద్ర ప్రసాద్ నందం రామారావు మేడిశెట్టి యోగేశ్వరరావు, వెచ్చ సత్యనారాయణమూర్తి, ధూళిపూడి రామభద్ర ప్రసాద్, చందమామ బాబులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్ సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్, పలువురు కవులు, రచయితలు, భాషాభిమానులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.