మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ శుక్రవారం జిల్లావ్యాప్తంగా 20 వేల మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వన మహోత్సవం – వనం మనం కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వనం మనం కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ నుండి మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభించి నవంబర్ నెల వరకు కొనసాగించాలన్నారు. ఈనెల 30వ తేదీన ఒక రోజే జిల్లా వ్యాప్తంగా 20వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తదితర విద్యాసంస్థల్లో, దేవాలయాలు చర్చిలు, మసీదులు తదితర ప్రార్ధన మందిరాలలో మొక్కలను విరివిగా నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మొక్కలు నాటడంతో పాటు క్రమం తప్పకుండా వాటికి నీరు పోసి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలన్నారు. విద్యాసంస్థలు, ప్రార్ధన మందిరాలలో ప్రహరీలు వున్న వాటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని ఎవరికి ఎన్ని మొక్కలు కావాలో వాటిని సకాలంలో పంపిణీ అయ్యే విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.
నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి మొక్క బతికేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వనమహోత్సవం గోడపత్రాలు, స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ రాజశేఖర్, జడ్పీ సీఈవో ఆనందకుమార్ కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శోభన్ బాబు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డి ఐ ఈ ఓ సాల్మన్ రాజు, డిపిఓ నాగేశ్వర్ నాయక్, డ్వామా పిడి సూర్యనారాయణ, డి ఈ ఓ తహేర సుల్తానా,ఉద్యాన అధికారి జ్యోతి, మైనారిటీ సంక్షేమ అధికారి రబ్బాని తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.