-జక్కంపూడి కాలనీలో ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడిన సిఎం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 8వ రోజు కూడా పర్యటించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బయలు దేరిన సిఎం ముందుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. పడవలు ఢీ కొనడం వల్ల దెబ్బతిన్న బ్యారేజ్ కు జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, నిపుణులతో మాట్లాడి కౌంటర్ వెయిట్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను చంద్రబాబు పరిశీలించారు. కుమ్మరిపాలెం సెంటర్ లో ఫైర్ ఇంజన్ల ద్వారా రోడ్లు క్లీన్ చేయడాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జక్కంపూడి కాలనీకి వెళ్లారు. జక్కంపూడి కాలనీ లోపలికి కారులో వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి కాలనీలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి. ప్రొక్లెయినర్ మీదనే ఇళ్ల వద్దకు వెళ్లిన సిఎం బాధిత ప్రజలతో మాట్లాడారు. వారి బాధలు విని ధైర్యం చెప్పారు. ఆహారం అందుతున్న విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీమా క్లెయిమ్స్ త్వరగా పూర్తి అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిట్టినగర్ సెంటర్, పైపుల రోడ్డు, బిఆర్టిఎస్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ చేసి…తన దృష్టికి వచ్చిన సమస్యలపై అధికారులతో చర్చించారు.
Prajavartha Online Telugu News