-ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహించి, వాటిని వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది:జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయానికి, వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, సదరు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని, వాటిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణ నందు ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలను జిల్లాలోని నలుమూలల నుండి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు, అధికారులు సదరు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కాయగూరలను, ఆకుకూరలను, పండ్లను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన పద్ధతులలో పండించిన సదరు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో హానికారక క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు పండిస్తారు, వాటిని మనం వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు. అలాగే మనం సదరు ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు సదురు కాయగూరలను ఆకుకూరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు, జిల్లా జడ్బిఎన్ఎఫ్ డిపిఎం షణ్ముగం, ఏపీఎంఐపి పిడి సతీష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News