మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానం ద్వారా వ్యర్ధపదార్థాలు తొలగింపు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్, పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా చెత్త పోగయ్యే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు వంటి చోట్ల సామూహిక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక గ్రామసభలు, సఫాయి మిత్రలు, పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించాలన్నారు. హెల్త్ చెకప్ లు నిర్వహించాలని, వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి లేనిది పరిశీలించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడం, పర్యావరణ అనుకూలమైన వస్తువుల తయారీపై పాఠశాల విద్యార్థులకు నిపుణుల చేత వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు తయారుచేసిన వస్తువులను గాంధీ జయంతి రోజున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసినవారికి నగదు బహుమతులు అందిస్తామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పి సీఈవో ఆనంద్ కుమార్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, పెడన, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వరరావు, గోపాల్ రావు, వెంకటేశ్వరరావు, డిపిఓ నాగేశ్వర నాయక్, డీఈవో తాహెర సుల్తానా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శివప్రసాద్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, ఎన్ఐసి ఏ డి ఐ ఓ సెల్వినా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News