-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత
-మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మంగళగిరి వీవర్ శాలతో వందలాది మందికి లబ్ధి
-చేనేతల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు
-త్వరలో విజయవాడ తరహా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేతలకు పూర్వ వైభవం : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత కార్మికులకు ట్రెండ్ కు తగ్గట్టు శిక్షణిచ్చి… చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. గురువారం ఆమె మంగళగిరి ఆటోనగర్ లో ఉన్న వీవర్ శాలను సందర్శించారు. మగ్గాలు ఏర్పాటు, స్టోర్ రూమ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, సేల్స్ కౌంటర్లను మంత్రి పరిశీలించారు. 20 స్టాండ్ లూమ్స్, జాక్ మిషన్ల పనితీరును తిలకించారు. అనంతరం మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన వీవర్ శాల ఎంతో మందికి శిక్షణివ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పిస్తోందన్నారు. వందలాది కుటుంబాలు వీవర్ శాల ద్వారా ఉపాధి పొందుతున్నాయని, ఇది ఎంతో ఆనందకర విషయమని అన్నారు. వీవర్ శాలలో పనిచేస్తూనే, ఇళ్ల దగ్గర సొంతంగానూ మహిళలు ఉపాధి పొందుతున్నారన్నారు. చేనేతలను అన్ని విధాలా అభివృద్ధి పరచడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నేతన్నల అభ్యున్నతికి 2014-19 మధ్య అమలు చేసిన పథకాలన్నింటినీ అమలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాల తయారీలో ట్రెండ్ కు తగ్గట్లు కొత్త డిజైన్లపై శిక్షణివ్వడమే కాకుండా ఉత్పత్తయిన దుస్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. రాబోయే దసరా పండగను దృష్టిలో పెట్టుకుని చేనేత వస్త్రాల అమ్మకాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలతో పాటు హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో చేనేత కార్మికుల నష్టాలపై నివేదికలు తెప్పించామని, నష్టపరిహారం కూడా అందజేస్తామని వెల్లడించారు. పూర్తిగా ఇల్లు మునిగిపోయిన చేనేత కార్మికులకు రూ.25 వేల నష్టపరిహారంతో నూలు కోసం అదనంగా రూ.5 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. అన్ని విధాలా చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంత్రి లోకేశ్ పై చేనేత కార్మికులు ప్రశంసలు
అంతకుముందు మంత్రి సవిత…వీవర్ శాలలో పనిచేస్తున్న మహిళలను, కార్మికలతో ముచ్చటించారు. తమకు రోజుకు రూ.500ల వరకు కిట్టుబాటు అవుతోందని, ఇదే కాకుండా ఇంటి దగ్గర కూడా సొంతంగా పనిచేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నామని మహిళలు తెలిపారు. మంత్రి లోకేశ్ సౌజన్యంతో తమకు జాక్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారన్నారు. ఆర్డర్లు కూడా తెప్పించి ఇస్తున్నారని, దీనివల్ల తాము ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతోందని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, మంగళగిరి నియోజక వర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ట్రెండ్ కు తగ్గట్లు శిక్షణ.. మార్కెటింగ్ సదుపాయం
అంతకుముందు మంత్రి సవిత …విజయవాడ నగరంలోని మాచవరం వీవర్స్ సర్వీస్ సెంటర్ ను సందర్శించారు. ఆ కేంద్ర డీడీ అనిల్ సాహు …వీవర్ సెంటర్లో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను మంత్రికి వివరించారు. సెంటర్లో శిక్షణ పొందుతున్నవిద్యార్థులు, చేనేత కార్మికులతో మంత్రి మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చేనేతలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చేనేతలకు స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. మారుతున్న కాలానుగుణంగా చేనేత కార్మికులకు వస్త్రాల తయారీలో శిక్షణిస్తున్నట్లు తెలిపారు. కొత్త డిజైన్ల తయారీలో శిక్షణివ్వడంతో పాటు రంగుల అద్దకంపైనా నిపుణులైన శిక్షకులతో శిక్షనిస్తున్నామన్నారు. కేవలం శిక్షనతోనే సరిపెట్టకుండా తయారైన వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. వీవర్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆరు వేల మందికి శిక్షణిచ్చామన్నారు. 5,302 నూతన డిజైన్లను రూపొందించి సర్వీస్ సెంటర్ లో శిక్షణ అందజేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 375 శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని, వాటి ద్వారా బ్యాచ్ కు 20 మంది శిక్షణివ్వ,న్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, వీవర్స్ సర్వీసు సెంటర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.