Breaking News

సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన

-ఇది పేదల ప్రభుత్వం -ఇది మంచి ప్రభుత్వం అని నినదించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్
-100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన మంత్రి కందుల దుర్గేష్
-ప్రజల ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ స్టిక్కర్లను గోడకు అతికించిన మంత్రి
-100 రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ..
-తీరుగూడెం సభలో నిడదవోలు పట్టణానికి వరాల జల్లు కురిపించిన మంత్రి కందుల దుర్గేష్
-త్వరలోనే నిడదవోలుకు మినీ స్టేడియం, వంద పడకల ఆసుపత్రి, గోదావరి జలాలు అని ప్రకటన
-కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి వెల్లడి
-ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ,సంక్షేమాన్ని అందిస్తూ ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో నిర్వహించారు.. కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని జ్యోతి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వందరోజుల ప్రగతిని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు.. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజా ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు. ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి 100 రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేశారు.. వాడవాడలో తిరుగుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని కోరుపల్లి, విజ్జేశ్వరం, నిడదవోలు లో పాక్షికంగా దెబ్బతిన్న 5 గృహాలకు సంబంధించి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఒక్కో కిలో చొప్పున కందిపప్పు ,పంచదార, పామ్ ఆయిల్, రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలు,బంగాళదుంపలను ఆయా కుటుంబాలకు మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. స్థానికంగా అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా తీరు గూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ,సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పెన్షన్లను పెంచిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రూ. 2000 నుండి రూ. 3000 కి పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పెన్షన్ ను నాలుగు వేలకు పెంచి ప్రజలకు ఒకటవ తేదీనే గుమ్మం వద్ద అందించింది అన్నారు. అంతేగాక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ లను జూలైలో ప్రజలకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీలను పునరుద్దరించామని తద్వారా పేద ప్రజల కడుపు నింపుతున్నామన్నారు. 16,000 కు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన చేశామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో దీపావళి నుండి ప్రజలకు మూడు ఉచిత సిలిండర్లు అందజేయనున్నామన్నారు.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేరుస్తామన్నారు.. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణానికి మంత్రి వరాల జల్లు కురిపించారు. నిడదవోలు పట్టణంలో ఇప్పటికే ఒక మినీ స్టేడియం మంజూరు చేశామని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. స్థానిక ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు. తద్వారా అవసరమైన వైద్యులు, సిబ్బంది వస్తారని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను పట్టణంలోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.. పట్టణానికి సమర్థవంతంగా పనిచేయగలిగే కమిషనర్ వచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. నిడదవోలు పట్టణం అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు తాను ఎమ్మెల్యే అని అనిపించుకోవడం కన్నా ప్రజల సేవకుడనని అనిపించుకోవడమే ఇష్టమని చెప్పానని, ఇప్పుడు ప్రజా సేవ చేస్తూ ఆ మాట నిజం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.రాబోయే ఐదేళ్లలో ప్రజల బాగోగులు చూస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలంతా మంచి మనసుతో, అమృత హస్తాలతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రభుత్వం పది కాలాలపాటు సంక్షేమ పాలన అందించాలని సంకల్పించాలన్నారు.. తన విజయానికి కారణమై ఎమ్మెల్యేను చేసి మంత్రిగా అవకాశం కల్పించిన నిడదవోలు పట్టణ ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంకల్పం సిద్ధించే దిశగా పని చేస్తామన్నారు. “ఇది పేదల ప్రభుత్వం-ఇది మంచి ప్రభుత్వం” అని ప్రజల సాక్షిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సభలో నినదించారు.

గత ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యధిక భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తారని తెలిపారు. అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రమైన తిరుమల లడ్డులో నాణ్యత లోపించిన నెయ్యి, కల్తీ నెయ్యిని వాడారని అన్ని చోట్ల వినబడుతుంది అన్నారు. గత ప్రభుత్వం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టింది అన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను గుర్తించి, భగవంతుడు శిక్షించి ఇంటికి పంపించాడని విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా పవిత్ర తిరుమల లడ్డు అపవిత్రమైన కారణంగా సమాజం మొత్తానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో, ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలన్న సదుద్దేశంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కూర్చొని ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారన్నారు.కేవలం హిందూ మతానికి ఇబ్బంది కలిగిందనే కాదు, ముస్లిం, క్రైస్తవం.. ఇలా ఏ మతానికి ఇబ్బంది కలిగినా ప్రభుత్వం ఇదే విధంగా స్పందించాలన్నారు.. ఆ బాధ్యత తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సింహాచలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వార్తలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ బండారం బయట పెట్టామన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కి కొందరు తెరతీసారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత అద్భుతంగా పరిపాలన అందిస్తుందని తెలిపారు.ప్రజలకు ఏ సమస్య ఉన్న ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.

ఇటీవల భారీ వర్షాలకు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న ఐదు బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంప కిట్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణి చేశారు. కిట్స్ అందుకున్న వారిలో కోరుమిల్లికి చెందిన రేలంగి విజయలక్ష్మి, మట్టా సుబ్బయ్యమ్మ, మంచిలి సత్యవతి, నిడదవోలు కి చెందిన ఔని వరలక్ష్మి , విజ్జేశ్వరం కి చెందిన దండు బోయిన రత్న కుమారి లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ భూపతి, ఆదినారాయణ , తహశీల్దార్ బి. నాగరాజు నాయక్ , మునిసిపల్ కమిషనర్ టి.ఎల్.పి.ఎస్.ఎస్. కృష్ణవేణి, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, టిడిపి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి నీలం రామారావు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *