Breaking News

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది

-భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారు… వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది
-గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను… భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో… తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు… ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయి.
భక్తులు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్థకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చింది. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికే ఎందుకు ఉత్సాహపడింది? వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తాము.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్ళకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు టీటీడీ ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేస్తున్నాను.
వైసీపీ పాలకులు నియమించిన పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని, ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారు. నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించింది. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అంబర్‌పేట కలాన్‌ ప్రాంతంలో స్థలం, మల్కాజిగిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్, నాందేడ్‌, బెంగళూరుల్లోని కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసింది. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న మా పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించాము. అప్పుడు వేలం ద్వారా విక్రయం ఆగింది.

ఆభరణాలు… నగలను పరిశీలించాలి
అదే విధంగా తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు నగలు, ఆభరణాలు అందచేశారు. వాటి జాబితాను కూడా పరిశీలించి… వాటి పరిస్థితిని కూడా గణించాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నాను. ఎందుకంటే స్థిరాస్తులను అమ్మేయాలని చూసినవాళ్ళు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా కచ్చితంగా పెడపోకడలతో ఏవైనా అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయం మీదా దృష్టిపెట్టాలి.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఎటు వెళ్లింది?
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి రూ.10,500 తీసుకున్నారు. ఇందులో బిల్లు రూ.500కే ఇచ్చారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ని కోరాను. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని
అప్పటి పాలకులు చెప్పారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? ఆ సంస్థ ఏమిటి? ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరం.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులను తనఖాలుపెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉంది. ఎందుకంటే నాడు పాలనలో ఉన్నవారికి ధర్మ పరిరక్షణపట్ల విశ్వాసం ఉన్నట్లు గోచరించడం లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, ఆభరణాల వివరాలతోపాటు, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడినీ ప్రజలకు తెలియచేయడం అవసరం. తద్వారా భక్తులకు వివరాలు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటంతోపాటు, ఆలయాల పాలక మండళ్ళు జవాబుదారీతనంతో పని చేస్తాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *