గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ఏబిసి సెంటర్ లో ప్రతి రోజు 100కు తగ్గకుండా వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబిసి) సర్జరీలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు సదరు కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. అదివారం కమిషనర్ ఏటుకూరు రోడ్ లోని ఏబిసి సెంటర్, వర్మి కంపోస్ట్ యూనిట్, వెంగళాయపాలెంలోని గోశాలలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఏబిసి సెంటర్ లోని ఆపరేషన్ ధియేటర్, ఆపరేషన్ అనంతరం కుక్కలను ఉంచుతున్న ప్రాంతాలు, వాటికి అందిస్తున్న ఆహారం, చికిత్స విధానాలను డాక్టర్ లను అడిగి తెలుసుకొని, ప్రతి రోజు తెస్తున్న కుక్కలు, ఆపరేషన్ చేసిన కుక్కల వివరాలను రిజిస్టర్ లో పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి కుక్కలపై నియంత్రణపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి నియంత్రణకు ఏటుకూరు రోడ్ లోని ఏబిసి సెంటర్ లో స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుందన్నారు. ప్రతి రోజు 100 కుక్కలకు ఆపరేషన్లు జరిగేలే ఏజన్సీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు తగిన విధంగా మౌళిక వసతులను జిఎంసి కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ జరిగిన కుక్కలకు నిర్దేశిత సమయం వరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, తగిన చికిత్స, ఆహారం అందించాలన్నారు. ఏబిసి సెంటర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే నగరంలో ఏ వీధిలో నుండి తెచ్చిన కుక్కలను ఆపరేషన్ అనంతరం అదే వీధిలో విడిచి పెట్టాలన్నారు. వర్మి కంపోస్ట్ యూనిట్ ని పరిశీలించి, నగరంలోని జిఎంసి పార్క్ లో, డివైడర్ ల మధ్యలోని మొక్కలకు అందించాలన్నారు. కంపోస్ట్ యార్డ్ ని పరిశీలించి, నగరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు జిందాల్ ప్రాజెక్ట్ కి తరలించాలన్నారు.
అనంతరం వెంగళాయపాలెంలోని గోశాలను పరిశీలించి, ఎన్ని ఆవులు ఉన్నదీ, వాటికి అందిస్తున్న ఆహార వివరాలు అడిగి తెలుసుకొని, పరిసరాలు బురదగా ఉండడం గమనించి ప్రాంగణం ఫ్లోరింగ్ చేయడానికి, నూతన షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, ఎంహెచ్ఓలు మధుసూదన్, ఆనందకుమార్, రాంబాబు, డిఈఈ సతీష్, ఏసిపి మురళి, టిపిఎస్ సువర్ణ కుమార్, ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు దాసరి ఏడుకొండలు, మల్లికార్జునరావు, స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News