-కిలో కందిపప్పు రూ.67… అర్థ కిలో పంచదార రూ.17
-నేటి నుంచి పంపిణీ ప్రారంభం
-రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్థ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కారుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు ధర రూ.67, అర్థ కిలో పంచదార రూ.17గా నిర్ణయించారు. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డులకు అందిస్తారు.
నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కిలో రూ.163 ధర ఉన్న కందిపప్పును రేషన్ కార్డుదారులకు రూ.67కి అందిస్తున్నాం. రూ.96 సబ్సిడీ ఇస్తున్నాము. కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు నిత్యవసర సరుకులు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాము. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి – బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయించేలా చూశాము. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే – ప్రజలకు, పేదలకు నిత్యవసరాలు అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే. అదే విధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యవసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసింది మా కూటమి ప్రభుత్వం. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించాము” అన్నారు.
Prajavartha Online Telugu News