Breaking News

కేంద్ర ప్రాయోజిత పధకాలను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళాలి

-రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పధకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి
-వివిధ దశల్లోని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ల పనుల వేగవంతం చేయాలి
-పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు
-పధకాల మలులో గల అడ్డంకులను తొలగించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు
-రాష్ట్ర డిజిపిలో 3వవంతు ఆదాయం వస్తున్నఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత పధకాలను (Centrally Sponsored Schemes)మరింత వేగవంతం చేసి యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా కేంద్రం నుండి మరిన్ని పధకాలు,నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పై వైద్య ఆరోగ్య,వ్యవసాయ, సహకార,ఉద్యానవన మత్స్య,మున్సిపల్ పరిపాలన,గృహ నిర్మాణ,ఆర్ధిక శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పలు సెంట్రల్ సెక్టార్ స్కీములను నిర్దేశిత గడువు ప్రకారం సకాలంలో పూర్తి చేయడం ద్వారా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పధకాలను,నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని అన్నారు.ఇప్పటికే అమలులో ఉన్న పలు ప్రాయోజిత పధకాల అమలులో ఎదురవుతున్న చిన్నచిన్న ఇబ్బందులను అధిక మించి జాప్యం లేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్ళి పనులు పూర్తి చేసిన కేంద్రం నుండి మరిన్ని నిధులు పొందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.పూర్తయిన పనులకు సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరు అయే వీలుంటుందని ఆదిశగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు కాని ఇతర ప్రయోజిత ప్రధకాలేమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా తగు పరిశీలన చేయాలని ఢిల్లీ ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ లవ్ అగర్వాల్ ను మరియు సంబంధిత శాఖల కార్యదర్శులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు.
రాష్ట్ర జిడిపిలో మూడవ వంతు ఆక్వా రంగం నుండే వస్తోందని కావున ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఆరంగంలో మంజూరైన వివిధ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు మరిన్ని నిధులు,పధకాలను రాష్ట్రానికి తెచ్చేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆశాఖ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా చేపల,రొయ్యల చెరువుల వివరాలన్నిటినీ నూరు శాతం కంప్యూటరీకరించడం తోపాటు ఆయా ఉత్పత్తులకు తగిన పరీక్షల నిర్వహణకు తగిన ల్యాబ్ లను ఏర్పాటు చేసి రాష్ట్రం నుండి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు పెద్దఎత్తున ఎగుమతి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక నాబార్డు,ఎంపెడాల ద్వారా తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని సిఎస్ సూచించారు.అదే విధంగా రాయలసీమ,ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందని ఆదిశగా తగిన ప్రణాళికలు సిద్దం చేసి సమర్పించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు.
ఢిల్లీ నుండి ఎపి భవన్ రెసిడెంట్ కమషనర్ లవ్ అగర్వాల్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ సిఎస్ఎస్ పధకాలకు సంబంధించి నిర్వహించిన పనులకు సకాలంలో యుసిలు సమర్పించ గలిగితే కేంద్రం నుండి తదుపరి నిధులు మంజూరు చేయించుకునేందుకు తగు అవకాశం ఉంటుందని చెప్పారు.
తొలుత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత పధకాలపై చర్చించగా ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్తు ఇన్ర్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM)కింద వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పడకల పెంపు,క్రిటికల్ కేర్ బ్లాకులు వంటి వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఐదేళ్ళ కాలానికి 367 కోట్ల రూ.లు మంజూరు కాగా వాటి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.అదే విధంగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్బిణీ స్రీలకు 5వేల రూ.లను చెల్లించే పధకం అమలు జరుగుతోందని వాటికి సలంలో నిధులు విడుదలైతే ఎక్కుమందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు.మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్టును 21వేల 377 కోట్ల రూ.లతో చేపట్టగా దానిలో కేంద్రం వాటా రూ.3వేల 924 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.8595 కోట్లు,లబ్దిదారుల వాటాగా రూ.8856 కోట్లుగా ఉందని ఇప్పటి వరకూ 16వేల 900 కోట్ల రూ.ల పనులను పూర్తి చేయడం జరిగిందని మిగతా పనులు పూర్తి చేసేందుకు మరో 7వేల కోట్ల రూ.లు అవసరం ఉందని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సిఎస్ దృష్టికి తెచ్చారు.బలహీన వర్గాల గృహనిర్మాణానికి సంబంధించి పిఎంఎవై అర్బన్ కింద రూ.31వేల 146 కోట్లతో వివిధ గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకూ రూ.17వేల 359 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్ వివరించారు.అలాగే పియంఎవై గ్రామీణ్,తదితర పధకాల కింద గృహ నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిపారు.
వ్యవసాయ శాఖలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.737 కోట్ల తో 8 పధకాలు అమలవుతుండగా దానిలో రూ.442 కోట్లు కేంద్రం వాటా కాగా రూ.295 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పనులు జరుగుతున్నట్టు ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు. అదే విధంగా కృషోతన్నతి యోజన కింద 7 ఉప పధకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖలకు సంబంధించి వివిధ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(PACS)కంప్యూటరీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టిందని రాష్ట్రంలో ఆప్రక్రియ వేగవంతంగా సాగుతోందని శాఖ కమషనర్ బాబు ఏ వర్చువల్ గా పాల్గొని వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి జానకి,వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు,ఆరోగ్యశ్రీ సిఇఓ లక్ష్మీషా తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *