విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజా ప్రతినిధులందరూ కష్టపడి పనిచేయాలని పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, APSFL మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం, నిరుద్యోగుల ఆకాంక్షల అమలు కోసం ఈ ఎన్నికలలో వైసీపీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడారు. ఉద్యోగులు, యువతను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో కూటమి నేతలకు ఈ ఎన్నికలతో తెలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు. కనుక పట్టభద్రుల ఓట్లు ఏఒక్కటీ మిగిలిపోకుండా.. షెడ్యుల్‌లోగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 లోపు నియోజకవర్గవ్యాప్తంగా క్యాంపులు నిర్వహించాలని.. ప్రతీ డివిజన్ లోనూ కనీసం 300 మంది పట్టభధ్రులను గుర్తించి ఓట్లు నమోదు చేయించాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రజాక్షేత్రంలో కష్టపడి పనిచేసి.. పార్టీని తిరుగులేని మెజార్టీతో గెలుపునందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, కుక్కల రమేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, ఒగ్గు గవాస్కర్, శనగశెట్టి హరిబాబు, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News