మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఇసుకను సమృద్ధిగా అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో కొత్త ఇసుక రీచ్ లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మైనింగ్, రవాణా, పోలీసు, భూగర్భ జల, పోర్టు తదితర అధికారులతో ఉచిత ఇసుక విధానంపై సమీక్షించారు. అదే సమయంలో ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలలో రీచ్ ల నుంచి ఇసుకను తీసుకువచ్చి బయట నిలువ చేసేందుకు ఎనిమిది స్టాక్ యార్డులను గుర్తించడం జరిగిందన్నారు.
స్టాక్ యార్డుకు కనీసం ఇద్దరు చొప్పున షిఫ్ట్ పద్ధతిలో పోలీసు సిబ్బందిని నియమించాలని, వారికి ఇతర బందోబస్తు విధులకు ఇబ్బంది కలగకుండా నియమించాలని సూచించారు. జిల్లాలో కొత్త ఇసుక రీచ్ లను గుర్తించి, అందులో పట్టా భూములను గుర్తించాలని అధికారులకు సూచించారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంశమని, ఆయన ఆదేశాల మేరకు నిర్మాణానికి అవసరమైన ఇసుకను సమకూర్చేందుకు ప్రత్యేక ఇసుక రీచ్ ను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి ప్రసాద్, మైనింగ్ ఏడి కొండారెడ్డి, డిపిఓ జే అరుణ, ఇరిగేషన్ శాఖ ఈఈ కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి.ఎల్. సిద్ధిక్, భూగర్భ జల శాఖ, పోర్టు తదితర అధికారులు పాల్గొన్నారు.