-రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన మద్యం పాలసీ 2024-26ను అనుసరించి మద్యం షాపుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియలో పాల్గొనవలసిన వ్యక్తి తన తరుపున ఇతరులకు అధీకృత అనుమతిని ఇవ్వవచ్చని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. ఒక వ్యక్తి ఒక దుకాణం కోసం దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, అదే క్రమంలో ఒక వ్యక్తి నిర్వహించగల దుకాణాల సంఖ్యపై కూడా పరిమితి విధించలేదని, ఎన్ని షాపులకైనా ఒకేవ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. ఈ పరిస్థితులలో నిర్దేశిత దుకాణం కోసం దరఖాస్తుదారుల ప్రతినిధులు అతని తరుపున దరఖాస్తులు దాఖలు చేయడానికి, డ్రాలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపధ్యంలో అధికార ప్రక్రియను సులభతరం చేస్తూ స్వీయ ధృవీకరణ కోసం ఐడి ఆధారిత ప్రామాణీకరణతో కూడిన ప్రొఫార్మా విడుదల చేసామని నిషాంత్ కుమార్ తెలిపారు. దీనిని దరఖాస్తుదారులు విస్తృత భాగస్వామ్యం కోసం ఉపయోగించవచ్చన్నారు. సూచించిన విధానంలో సాధారణ తెల్ల కాగితంపై దరఖాస్తుదారుని పేరు, అధీకృత వ్యక్తి పేరు వంటి వివరాలు నమోదు చేసి అధికారులకు అందచేస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, డిప్యూటీ కమీషనర్‌లు ఈ అంశాలను పరిగణన లోకి తీసుకుని, తదనుగుణంగా వ్యవహరించవలసి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు అదేశించారు.
Prajavartha Online Telugu News