-ప్రజలకు విక్రయించే సరకుల నాణ్యత, ధరలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ఆకస్మికంగా రెండు రైతు బజార్లను పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేసారు. శుక్రవారం గురునానక్ కాలనీ సహా, పంటకాలువ రోడ్ లో ఉన్న రైతు బజార్లను మంత్రి తనిఖీ చేసి వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారుల అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ లీటరు రూ.110కి, సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని, అదేవిధంగా అందరికీ కనబడేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలన్నారు. రాష్ట్రంలోని కోటి 49లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుంది. రైతు బజార్ లలోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులు మంత్రి ఏర్పాటు చేయించారు. ప్రజలకు విక్రయించే ఉల్లి, టామాటా నాణ్యతనూ పరిశీలించారు. నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసారు.
Prajavartha Online Telugu News