Breaking News

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి….

-ప్రభంజనంలా భవానిలా రాక…
-ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్
-డాక్టర్ జి. సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజు ప్రారంభమైన భవానీ మాలధారుల ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో భవానీలు జై భవాని….. జై జై భవానీ…….నామ స్మరణతో ఇంద్రకీలాద్రి వైపు అడుగులేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సమానంగా భవానిమాల దీక్షధారుల సంఖ్య ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాలలో భవానిల రాక సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆంక్షలు విధించారు. వన్ టౌన్ లోబ్రిడ్జి నుంచి ఇంద్రకీలాద్రి వరకు భవానిల రాకతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో వాహనాల రాకపోకలను నియంత్రించడంపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా వినాయకుని గుడి సమీపం నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే క్రమంలో వారికి అవసరమైన మంచినీరు, వేడి పాలు వంటి అవసరాలను తీర్చేందుకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను కొనసాగిస్తున్నారు. భవానీ మాలధారులకు వేగవంతమైన దర్శన భాగ్యం కోసం అవసరమైన చర్యలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే తీసుకుంటున్నారు. ప్రధానంగా దర్శనం చేసుకున్న భవానీలు తిరిగి వెళ్లే క్రమంలో సైతం సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు సైతం భక్తులతో నిండిపోయింది. శనీశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలు సైతం భవానీ లతో కిక్కిరిసిపోయాయి. వీరికి అవసరమైన సదుపాయాల కల్పనలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి నేతృతంలో పలువురు ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారు. భవాని మాలధారుల రద్దీ తగ్గేవరకు కలెక్టర్, పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. భవాని మాలధారుల రద్దీ రేపు కూడా కొనసాగనుండటంతో ట్రాఫిక్కు సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *