గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు భారీ వర్షాల ప్రభావంతో గుంటూరు నగరంలో ప్రజలు తమ ప్రాంతాల్లో సమస్యలను తెలియచేయడానికి, ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర స్పందన కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 0863-2345105 కంట్రోల్ రూమ్ (24 గంటలు) ఏర్పాటు చేశామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల పై వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో గుంటూరు నగరంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా వర్షాల వలన ఏ సమస్య ఎదురైనా ప్రజలు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న 0863-2345105 కంట్రోల్ రూమ్ (24 గంటలు)కి సమాచారం అందిస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో 3 షిఫ్ట్ లుగా సిబ్బందిని కేటాయించామని, ప్రజల నుండి అందే ఫిర్యాదులు, వాటి పరిష్కార చర్యలపై ఎస్.ఈ., సిఎంఓహెచ్, ఎంహెచ్ఓ లు సమన్వయం చేసుకుంటారన్నారు. అలాగే నగరంలో వర్షాల వలన రోడ్ల మీద చెట్లు పడితే తొలగించడానికి వీలుగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏడిహెచ్ ని, త్రాగునీటి పంపింగ్ రిజర్వాయర్లలో విద్యుత్ అంతరాయం వలన సరఫరాకి ఇబ్బంది రాకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామని తెలిపారు. వర్షాల తీవ్రత పెరిగి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే నీటిని బెయిల్ అవుట్ చేయడం, స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్దంగా ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News