మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి వృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల కమిటీలోని వయోవృద్ధుల సమస్యలను, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చట్టరీత్యా వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి 270 కేసులు రాగా అందులో 257 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. మచిలీపట్నం ఆర్డిఓ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కరించాలన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలు నెలవారి భత్యం వారి ఖాతాలో జమ చేస్తారనే విషయంపై ఎలాంటి నమ్మకం లేకపోతే ఆర్డీవోల పరిధిలో ఒక బ్యాంకు ఖాతాను తెరచి అందులో భత్యం జమ అయ్యేలా చూడాలన్నారు. అందులో నుండి వయోవృద్ధులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వయోవృద్ధుల కోసం ప్రాధాన్యత నిచ్చి ప్రత్యేక ప్రవేశ మార్గం ద్వారా వారి అర్జీలను స్వీకరించేందుకు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఏవో కు సూచించారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న బ్యాంకర్ల సమావేశంలో రెవిన్యూ మార్ట్ గేజ్ పథకం గురించి చర్చిస్తామన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అందులో తహసిల్దారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, వైద్యాధికారి, చురుకైన వయోవృద్ధులు ఉండాలన్నారు. వారు ప్రతి నెల మొదటి మంగళవారం సమావేశమై వయోవృద్ధుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తారన్నారు.
సచివాలయాల్లోని మహిళా పోలీసులను వయోవృద్ధుల సంక్షేమంపై చైతన్యపరచి వృద్ధమిత్రులుగా తయారుచేసి ఏమైనా సమస్యలు ఉంటే మండల స్థాయిలో జరిగే సమావేశం దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి తన ఆధ్వర్యంలో మూడవ శుక్రవారం వృద్ధుల సంక్షేమం కోసం జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. మీకోసం లో వచ్చే అర్జీలను మండల స్థాయి కమిటీల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించాల్సి ఉంటుందన్నారు
ప్రభుత్వ ఆసుపత్రులలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా పడకలు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా పోలీసు అధికారి త్వరలో నిర్వహించనున్న నేరాల సమీక్ష సమావేశంలో వృద్ధుల సంక్షేమం, వారి ఆస్తుల రక్షణ గురించి పోలీసులు అందరిని చైతన్య పరుస్తామన్నారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు జిల్లా కలెక్టర్ నిర్ణయాలతో తాము చాలా అదృష్టవంతులమని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, అదనపు ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్, జిల్లా వయోవృద్ధులు దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు కామరాజు డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్ డిఎంహెచ్వో డాక్టర్ ఐసిడిఎస్ పిడి సువర్ణ జడ్పిసిఓ కన్నమ నాయుడు, ఎల్ డి ఎం జయవర్ధన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓలు స్వాతి,జి.బాలసుబ్రమణ్యం, షారోన్ తదితర అధికారులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News