-రూ. 5 లక్షల విలువైన యూనిఫారం దుస్తులను పంపిణీ చేసిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రోజువారి విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు, సంభవించిన వరదల్లో మచిలీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇటీవల విజయవాడ వరదల్లో మచిలీపట్నం నుంచి వెళ్లి వరద బాధితులకు విశేష సేవలు అందించిన 250 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని పంపులు చెరువు ఆవరణలో రూ.5 లక్షల విలువైన యూనిఫారం దుస్తులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలువ గట్టులను బలోపేతం చేయకపోవడంతో భారీ వర్షాలు, వరదలకు ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరుకు భారీ గండ్లు పడి విజయవాడ నగరంలోని సింగ్ నగర్ వంటి ప్రాంతాలను వరదలు ముంచెత్తాయన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 10 రోజులకు పైగా విజయవాడ కలెక్టర్ లోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేసి ప్రమాద నివారణ చర్యలను చేపట్టిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ క్రమంలో విజయవాడలోని వరద బాధితులకు సేవలను అందించేందుకు మచిలీపట్నం నగరం నుంచి 250 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు తరలి వెళ్లి బాధితులకు విశేష సేవలందించారని మంత్రి అభినందించారు. వారి సేవలకు గుర్తింపుగా ఈ యూనిఫారంలే కాకుండా తన వంతుగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పాదరక్షకులు త్వరలో అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం కోసం ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించి వారి ఆరోగ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి విజయవాడకు బోట్లు, పడవలు తరలించి వాటి ద్వారా వరద బాధితులకు ఆహారం, ఔషధాలు అందించి మచిలీపట్నం తరపున విశేష సేవలు అందించి బాధితులకు అండగా నిలిచిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు. మచిలీపట్నం మున్సిపాలిటీ దేశంలోనే రెండవదని, అలాంటి పురాతనమైన, విశిష్టత కలిగిన నగరాన్ని నా బంగారు బందరు కోసం శ్రమదానం కార్యక్రమంతో స్వచ్ఛ బందరుగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. మచిలీపట్నం నగరం డంపింగ్ యార్డులో లక్ష టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని, రానున్న మూడు నుంచి 6 నెలల్లో ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో తరలింపుకు చర్యలు తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో నగరానికి చెత్త సమస్య లేకుండా తడి పొడి చెత్తగా వేరుచేసి సేకరించే విధంగా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే స్థలంలో ఒక సుందరమైన పార్కును నిర్మిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు మాదివాడ రాము, వెంకట్రావు, నాగబాబు, కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News