Breaking News

‘మిషన్ లైఫ్’ అమలుకోసం ‘బీఈఈ’తో కలిసిన ఏపీ

-నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా అమలు
-ఏపీలో ప్రధాన నగరాలపై దృష్టి కేంద్రీకరించిన బీఈఈ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మిషన్ లైఫ్ పేరుతో అమలు చేస్తున్న పథకంలో భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన జీవన విధానం, ఇంధన సామర్థ్యం పెంపుదలలో అత్యున్నత ప్రమాణాలను సాధించడం కోసం బీఈఈతో కలిసి పని చేయడంలో రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇంధన సామర్థ్యం పెంపు కోసం మిషన్ లైఫ్ కార్యక్రమాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించేందుకు బీఈఈ చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసించింది. ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి, విశాఖపట్నం(వైజాగ్), విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, త్రివేండ్రం, చెన్నైతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా దక్షిణ భారతదేశంలోని ప్రధాననగరాల్లో మిషన్ లైఫ్ ప్రచారం లక్ష్యంగా చేసుకున్నారు. ఇంధన వినియోగంలో రాష్ట్ర సామర్థ్యం మరింత మెరుగయ్యేలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలకమైన అన్ని విభాగాలను ఈ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేస్తున్న ఏపీ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ (ఎ.పి.ఎస్.ఇ.ఎం) వంటి సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా లక్ష్యసాధన కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగు పడటంతోపాటు ఇంధన భద్రత, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నతమైన పర్యావరణ ప్రమాణాలతో కూడిన మెరుగైన జీవనం కోసం ముందుకుసాగాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా బీఈఈ సంస్థ దక్షిణభారత విభాగం మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈఓ బి.ఎ.వి.కుమార్ రెడ్డితో కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మిషన్ లైఫ్ కార్యక్రమాల్లోని ప్రధాన లక్ష్యాలు, వాటితో భావిభారత పౌరులకు చేకూరనున్న లాభాలపై చర్చించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రత్యేక ప్రధానకార్యదర్శి విజయానంద్, ఇంధనశాఖ మద్దతును వ్యక్తంచేశారు.

ఇంధన పొదుపు, సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన ముందడుగు : ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.విజయానంద్
ప్రతిష్టాత్మక మిషన్ లైఫ్ పథకం అమలుతో రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు దోహదం కాగలదని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.విజయానంద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మూల మూలల్లో ఇంధన సామర్థ్యం పెంపుదలకు ఈ పథకం దోహదకారి కానుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాల సాధనకోసం కీలకమైన అన్ని ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంధన సమర్థ వినియోగంలో అగ్రగామిగా నిలపడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు మెరుగైన, చౌకైన విద్యుత్తుసరఫరా చేయడం, తద్వారా గ్రీన్ హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ లక్ష్యసాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం బీఈఈ, కేంద్రప్రభుత్వ ఇంధనశాఖ పరిధిలో పనిచేస్తున్న పబ్లిక్ సెక్టార్ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్)తో కలిసి ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇఇఎస్ఎల్ ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహిస్తున్న వరుస సమావేశాలలో విస్తృత చర్చల ద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా సమగ్ర రోడ్ మ్యాప్ నమూనా తయారు చేస్తున్నట్లు విజయానంద్ వెల్లడించారు. “ప్రకృతిని పరిరక్షించిన వారిని ప్రకృతే రక్షిస్తుంది” అనే నినాదంతో మిషన్ లైఫ్ కార్యక్రమాలను ప్రతి మూలకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీఈఈతోపాటు ఇతర భాగస్వాముల సహకారంతో ప్రాంతీయ కార్యక్రమాలు నిర్వహణకు గల అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిషన్ లైఫ్ లక్ష్యాల సాధనలో నెంబర్ వన్ గా నిలపడమే” ప్రధాన లక్ష్యమన్నారు. మిషన్ లైఫ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలతోపాటు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందని బీఈఈ దక్షిణ భారత మీడియా సలహాదారు చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఇలాంటి మెరుగైన పద్ధతులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో స్థానిక చిరు వ్యాపారులకు లాభం కలిగేలా పర్యావరణ అనుకూలమైన సేవలు, వస్తువులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. కాలుష్య నియంత్రణ, పొదుపైన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనుకూలమైన పర్యాటకాభివృద్ధి, సహజవనరుల పరిరక్షణతో స్థానిక పేదలకు ఉపాధి కల్పన వంటివి సాధ్యమవుతాయి. ఎల్ఈడీ లైట్ల వినియోగం, ప్రజా రవాణా వ్యవస్థల సమర్థ వినియోగం, సైక్లింగ్, కార్ పూలింగ్, సీఎన్జీ, విద్యుత్తు వాహనాల వినియోగం, సౌరశక్తి సద్వినియోగం వంటి 75రకాల పద్ధతులను మిషన్ లైఫ్ సూచిస్తోంది. ‘క్లీన్ ఎనర్జీ పాలసీ-2024’ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివరించారు. ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంపిణీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అవకాశం పెంచడంలో మొదటి ప్రాధాన్య ప్రదేశంగా ముందుండాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రంగంలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులతో 7.5లక్షల మందికి ఉపాధికల్పించడం ద్వారా 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధించడం లక్ష్యంగా గణనీయమైన మార్పుతో ముందుకు సాగేలా కలిసి రావాలని ఇండస్ట్రీ లీడర్స్, పెట్టుబడిదారులు, ప్రజలను కోరుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *