విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్, వాంబే కాలనీ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో వరద బీభత్సం వలన నష్టపోయిన చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమర్థవంతంగా వరద బాధితులకు తగు సహాయక చర్యలు అందజేయగా ఆయా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎంతో సహాయం చేశారని తెలిపారు. ఈరోజు చిన్న ప్రైవేట్ పాఠశాలల సంక్షేమం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఫెడరేషన్ కార్యవర్గానికి విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేయుటకు రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి కర్నూలు, చిత్తూరు వరకు అందరూ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కంటి మహంతి మాట్లాడుతూ చిన్న బడ్జెట్ పాఠశాలల కొరకు ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్ స్థాపించి ఆయా వేదికల మీదుగా వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయగలగడం మా దన్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు డేవిడ్ రాష్ట్ర అధ్యక్షులు, వేల్పుల సుదర్శన్, ఉమామహేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ట్రెజరర్. దీపిక రెడ్డి, జాయింట్ కార్యదర్శి. అంజద్ అలీ బేగ్ రాష్ట్ర కార్యవర్గం తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News