Breaking News

పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ ఇవ్వాలి…

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు ప్యాకేజీలు, పిఎంఏవై ఇళ్ల లబ్దిదారులకు రూ.1.25 లక్షల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాల నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పశ్చిమగోదావరిలో 26 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలంలో 28 గ్రామాలతో పాటు ప్రాజెక్టులో నాలుగు ముంపు మండలాలు ఉన్నాయని, గేట్లు పరీక్షించే నెంపతో మూసేయడం వల్ల ఈ గ్రామాలన్నీ నీటితో మునిగిపోయాయన్నారు. రెండు జిల్లాల్లోని ముంపు మండలాల్లో గ్రామస్తులు అక్కడి నుంచి బయటకు రాలేని పరిస్తితుల్లో ఉన్నారని, అసౌకర్యంతో బాధపడుతున్నారని చెప్పారు. నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్న కాలనీల్లో నీరు, కరెంటు సదుపాయం లేదని, రోడ్లు లేవని, ఇళ్లు నాసిరకంగా నిర్మించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఇస్తే ప్రాజెక్టును 76 శాతం పూర్తిచేశారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని 22 శాతం పూర్తిచేశారని అందువల్ల నిర్వాసితుల పరిస్తితి ఇలా దిగజారిందని ఆవేదన చెందారు.

నిర్వాసితులకు చట్టపరంగా అందాల్సిన సహాయ, పునరావాస ప్యాకేజీని, నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించి ఇళ్ల కాలనీలను పూర్తిచేశాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు అమలుకాని, నష్టపరిహారం చెల్లింపుకాని, ఇళ్ల నిర్మాణం పూర్తిచేయకుండానే గత ప్రభుత్వం 33 మీటర్ల ఎత్తున కాపర్ల్యాం నిర్మించాలని సంకల్పించిందని అదే నిర్వాసితుల పాలిట తీవ్ర అసౌకర్యాన్ని కలిగిందని అన్నారు. దీని వల్ల 137 గ్రామాల ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు తీరును ప్రశ్నించిన జగన్ ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తప్పుపట్టారు. 18 ఏళ్లు దాటిన వారికి కూడా ప్యాకేజీని అమలుచేయాలని చెప్పారు. రూ.80 వేల కోట్లు సంక్షేమ పథకాలకై ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరంతో నిర్వాసితులైన గిరిజనులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కనీసం రూ.4 వేల కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. నిర్వాసితులను గాలికి వదిలేసి ప్రాజెక్టును ఒక్కటే కట్టడం లక్ష్యంగా పెట్టుకోవద్దని సూచించారు.

హౌసింగ్ పథకంలో లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల సబ్సిడీని ఇవ్వాలని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30 లక్షల పట్టాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.7 వేల కోట్లలో సగం అవినీతి జరిగిందన్నారు. ఒక్కో పట్టాకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ. 23,333 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. కాని కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు సబ్సిడీగా, రూ.30 వేల నరేగా టైఅప్తో రూ.1.80 లక్షలు ఇస్తుందన్నారు. అలాగే కాలనీల్లో లేఅవుట్లకు రూ.3 వేల కోట్లు ఇచ్చిందన్నారు. మొత్తం ఒక్కో ఇంటికి రూ.1.95 లక్షలు ఖర్చుచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన 30 లక్షల పట్టా భూముల్లో ఎలాంటి సదుపాయాలు లేకుండానే ఇళ్లు కట్టుకోమని లేకుంటే పట్టాలు రద్దుచేస్తామని లబ్దిదారులను బలవంతపెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో ఇంటికి తన వంతుగా రూ.1.25 లక్షల సబ్సిడీని ఇవ్వాలని, ఇళ్లకు మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు.

తెదేపా ప్రభుత్వం కట్టిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడం, లేదా వారి చెల్లించిన నగదును తిరిగి ఇవ్వకపోవడాన్ని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టారు. కోవిద్ సమయంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 10 వేల వైద్యసిబ్బంది పోస్టులను భర్తీచేసి వారికి జీతాలిస్తుందన్నారు. వాజ్పేయి ఏర్పాటుచేసిన ఆరోగ్య కేంద్రాలకు చంద్రబాబు, జగన్ తమ పేర్లు మార్చుకున్నారని, పదివేల ఉద్యోగాలు తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సర్వశిక్ష అభియాన్ పథకంలో యూనిఫాం, పుస్తకాలు, మద్యాహ్నభోజన పథకం, తరగతి గదుల నిర్మాణం వంటి వాటికి ఉమ్మడి ఎపీలో రూ.6 వేల కోట్లు ఇచ్చేవారని, నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా రూ.5 వేల కోట్లు ఇచ్చేవారన్నారు. నిధులు కేంద్రం ఇస్తుంటే ప్రచారం రాష్ట్రం చేసుకుంటుందని విమర్శించారు. మైనింగ్ పీడిత ప్రాంతాల అభివృద్ధికి నిధిని ఏర్పాటుచేయాలని కాని ఆ నిధి ఏమైందో చెప్పాలన్నారు. జిల్లా ఖనిజ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేవారు. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, సౌకర్యం, హౌసింగ్కు సబ్సిడీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేకుంటే భాజపా ప్రజాపోరాటానికి సిద్దంగా ఉందని హెచ్చరించారు. వేదికపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, విష్ణుకుమారరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి, జిల్లా ఇంఛార్జి కోడూరి లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *