-నియోజకవర్గంలో చెరువుల మరమ్మత్తులు, తాగునీటి అవసరాలు తీర్చాలి
-జలవనరుల శాఖ మంత్రిని కోరిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లాలో రైతులు, ప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా పీలేరు మండిపల్లె నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లె రిజర్వాయర్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసేందుకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, సంబేపల్లి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం ఈ ఆరు మండలాలలో ఉన్న చెరువుల మరమ్మత్తు పనులు, తాగునీటి సమస్య తదితర ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. మరియు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అడవిపల్లె రిజర్వుయిర్ కి నీళ్లు ఇవ్వాలన్నారు. రాబోయే రోజులలో నీటి నిల్వలు పెంపొందిస్తూ జిల్లాలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రిని కోరడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News