విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ-శ్రమ్ పధకం క్రింద నమోదుకు 18 నుండి 59 సంవత్సరముల మధ్య వయస్సు కల్గి ఉన్న అసంఘటిత కార్మికులు మరియు వలస కార్మికులు పేర్లు నమోదుకు అర్హులని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు పేర్కొన్నారు. స్థానిక దేవి చౌక్ నందు అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలియ అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. ఆయా కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ లో వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నమోదు ప్రక్రియ సమీప గ్రామ/ వార్డు సచివాలయములలో, CSC సెంటర్స్ లో జరుగును. ఈ పథకం క్రింద నమోదైన కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డు జారీ జరుగును.
ఇప్పటివరకూ తూర్పు గోదావరి జిల్లాలో ఈ-శ్రమ్ పధకం క్రింద 3,18,014 మంది కార్మికులు నమోదు అయినారు. ఇంకనూ, 2,27,796 మంది కార్మికులు నమోదు అవ్వవలసి ఉన్నారు.
ప్రయోజనములు
ఎక్స్-గ్రేషియా:- ఈ-శ్రమ్ పధకం క్రింద తేది: 31.03.2022 వరకూ నమోదయిన కార్మికుడు (లేదా) కార్మికురాలు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినట్లయినా వారికి ప్రభుత్వము రూ.2,00,000/- ఆర్థిక సహాయమును అందించబడును. అటులనే, పాక్షిక అంగవైకల్యం పొందినట్లయితే వారికి ప్రభుత్వము రూ.1,00,000/- ఆర్ధిక సహాయమును అందించబడును. ఎక్స్-గ్రేషియా కి సంబంధించి క్లెయిమ్స్ స్వీకరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని కార్మిక శాఖ అధికారులు తెలిపారు.
ఈ-శ్రమ్ పధకం క్రింద నమోదయిన వలస కార్మికుడు (లేదా) వలస కార్మికురాలు తమ సొంత రాష్ట్రములో కానీ, ఆంధ్ర రాష్ట్రములో కానీ ఎక్కడా కూడా రేషన్ కార్డు పొందనట్లైతే వారికి జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ద్వారా రేషన్ కార్డులు ఇప్పించుట జరుగును. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారికి జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసియున్నారు
వృత్తి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశములు కల్పించడం కోసం ఈ-శ్రమ్ పధకం క్రింద నమోదైన కార్మికుడు (లేదా) కార్మికురాలు ప్రభుత్వము ద్వారా వృత్తి నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశములు పొందవచ్చుననీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఒఫ్ లేబర్ బి.ఎస్.ఎమ్.వల్లి , అసిస్టెంట్ లేబర్ ఎస్.కార్తీక్ ఆఫీసర్లు శ్రీమతి ఎం. లలిత కుమారి , శ్రీమతి షేక్ జబీన , టి.ఎస్. కార్తీక్ గా, ప్లమ్బర్, విద్యుత్, భవన నిర్మాణ తదితర రంగాల్లోని కార్మికులు పాల్గొన్నారు.