గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్, రోడ్ల ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని, ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలని జిఎంసి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు కొరెటెపాడు సెంటర్ నుండి గుజ్జనగుండ్ల సెంటర్ వరకు జిఎంసి చేపట్టిన డ్రైన్, రోడ్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను, గుజ్జనగుండ్ల పాల్టెక్నిక్ కాలేజీ దగ్గర వెండింగ్ జోన్ ఏర్పాటు మార్కింగ్ లను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డ్రైన్ ఆక్రమణలను పరిశీలించి, ఇప్పటికే ఆక్రమణదారులకు ముందస్తుగా ఆక్రమణలను తొలగించుకోవాలని సమాచారం అందించామని, ఎక్కువ మంది సహకరించి స్వచ్చందంగా తొలగించుకొన్నారన్నారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాలోని డ్రైన్లలో పూడికను వెంటనే తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వచ్చందంగా తొలగించుకోని వాటిని బుధవారానికి తొలగించాలని, తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులు డ్రైన్ కి వెలుపలకు రాకూడదన్నారు. డ్రైన్ పై పూడిక తీయడానికి వీలుగా ప్రతి 5 అడుగులకు ఒక మ్యాన్ హోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం గుజ్జనగుండ్ల పాల్టెక్నిక్ కాలేజి రోడ్ లో ప్రతిపాదించిన వెండింగ్ జోన్ కు మార్కింగ్ ని పరిశీలించి, ట్రాఫిక్ కి అవరోధం కాకుండా, బండ్లు రోడ్ల మీదకు రాకుండా ఉండేలా మార్కింగ్ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమ శేఖర్, ఏఈ చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News