గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా అనధికార కుళాయిల తొలగింపుపై ఇంజినీరింగ్, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు శ్యామలనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బ్రాడీపేట, లక్ష్మీపురం, పెద్దపలకలూరు రోడ్ ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను, గుజ్జనగుండ్ల సెంటర్ లో వెండింగ్ జోన్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శ్యామలా నగర్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ కు అనధికారికంగా మున్సిపల్ ట్యాప్ లు ఉండటం గమనించి, సంబందిత పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణం డిస్ కనెక్షన్ చేయాలని ఆదేశించారు. నూతన భవన నిర్మాణ ప్లాన్ మంజూరుకి ముందే గతంలో ఉండే హౌస్ ట్యాప్ కనెక్షన్ ని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. బహుళ అంతస్తు భవనాల్లో ప్లాట్ల వారీగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం వేచి ఉండకుండా ఆస్తి పన్ను విధించాలని అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. అలాగే భవనాల ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా, బహుళ అంతస్తు భవనాలు డ్రైన్ ని అవుట్ ఫాల్ డ్రైన్ వరకు కనెక్ట్ చేయాలన్నారు. అలాగే నివాస ప్రాంతాల్లో గేదెల డైరీ ఏర్పాటు చేసి, వ్యర్ధాలను డ్రైన్ లోకి వదులుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. పలు ప్రదేశాల్లో డ్రైన్ల శుభ్రం చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా కాల్వలు శుభ్రం చేయాలని, డెబ్రిస్ ని ప్రత్యేకంగా ట్రాక్టర్లను తీసుకొని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
అనంతరం కమిషనర్ గుజ్జనగుండ్ల ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మానం పద్మశ్రీ, పట్టణ ప్రణాళిక అధికారులు, స్ట్రీట్ వెండర్స్ కలిసి పర్యటించి, త్వరలో గుజ్జనగుండ్ల ప్రాంత వీధి వ్యాపారులకు అనువుగా ఉండేలా వెండింగ్ జోన్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
పర్యటనలో ఏసిపి రెహ్మాన్, వెంకటేశ్వరరావు, డిఈఈలు రమేష్ బాబు, శ్రీనివాసరావు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు
-అమిత్ షా గారి సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ -జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం -సమష్టిగా …