అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద ఆదివారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తదుపరి మువన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా గతణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 76 వసంతాలు పూర్తయ్యాయన్నారు. మన రాజ్యాంగం దేశ పౌరులు అందరికీ స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం,ఓటు హక్కును కల్పించిందిందని ఓటు హక్కు ద్వారా మనకు మనమే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగం కల్పించిందన్నారు.అంతేగాక మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి వల్ల కాలానుగుణంగా ఎదురయ్యే ప్రతి బంధకాలను తొలగించుకునేందుకు రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని ఆప్రకారం ఇప్పటి వరకూ మన రాజ్యాంగాన్ని106 సార్లు సవరించు కున్నామని గుర్తు చేశారు.రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్నాళ్ళయినా సమాజంలో పేదరికం,నిరక్షరాస్యత,అవినీతి, అసమానతలు,లింగవివక్షత,ఉగ్రవాదం,మతతత్వం,మాదక ద్రవ్యాల వాడకం,మహిళలపై హింస వంటి అనేక సవాళ్ళు నేడు మనముందు ఉన్నాయని వాటిని ఏవిధంగా పరిష్కరించాలనే దానిపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని హితపు పలికారు.అదే విధంగా ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాలను పేదలంరికీ చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమంటే రానురాను చట్ట సభలు ముఖ్యంగా అసెంబ్లీ సమావేసాల పనిదినాలు తగ్గిపోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం బలహీనమౌతోందని అనిపిస్తోందని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.కావున అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.1983లో ఎన్టిఆర్ సియంగా ఉండగా బడ్జెట్ సమావేశాలే 45 రోజుల పాటు జరిగేవని కొన్ని సందర్భాల్లో అర్దరాత్రి వరకూ జరిగేవని గుర్తు చేశారు.ఈవిధంగా ఎక్కువ రోజులు చట్ట సభలు జరుపుకోగలిగితే ప్రజా సమస్యలపై మరింత లోతైన చర్చ జరిపి ప్రజలకు మరింత మేలు చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాఖ్య స్పూర్తిని రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నేతలను ఒక తాటిపైకి తెచ్చిన వారు దివంగత ఎన్టిఆర్ అని గుర్తు చేశారు.
ప్రస్తుత 16వ శాసన సభకు 84మంది కొత్తగా ఎంఎల్ఏలుగా ఎన్నికయ్యారని వారితో పాటు మిగతా శాసన సభ్యులకు సహితం శాసన సభ నియమాలు,పద్ధతులపై సభలో చర్చించే విధానం,వాదనలపై అవగాహన కల్పిచేందుకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్టు అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.మాజీ ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు,లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వంటి వారిని ఈశిక్షణా తరగతులకు ఆహ్వానించి చట్టసభల్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై వంటి అనేక విషయాలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.
ఈకార్యక్రమంలో ఉప సభాపతి కె.రఘురామ కృష్ణ రాజు,20 సూత్రాల కార్యక్రమం చైర్ పర్శన్ లంకా దినకర్,మాదిగ కార్పొరేషన్ అధ్యక్షురాలు ఉండవల్లి శ్రీదేవి,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్,అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …