Breaking News

పీ4 విధానంలో రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి చేపడుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్

-రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి
-27 జనవరి, 2025 న విశాఖ నోవాటెల్ హోటల్ లో ఉదయం 10 గం.లకు టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల ఇన్వెస్టర్లు హాజరుకావాలని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్
-ఫిబ్రవరిలో తిరుపతిలో మరో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహిస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
-అమరావతి రాజధానిలో రివర్ ఫ్రంట్ ను పర్యాటక అభివృద్ధికి కేటాయించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్.. రూ.500 కోట్లతో భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుడతామన్న మంత్రి దుర్గేష్
-గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. పర్యాటక శోభ సంతరించుకోనున్న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లు
-మరో రెండు మూడు రోజుల్లో అఖండ గోదావరి ప్రాజెక్టు టెండర్లకు పిలుపునిస్తామన్న మంత్రి దుర్గేష్
-సింగిల్ విండో విధానంలో ఇన్వెస్టర్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తామన్న మంత్రి దుర్గేష్
-ఆసక్తిగల ఇన్వెస్టర్లు సరైన ప్రతిపాదనలతో టూరిజం కాన్ క్లేవ్ లకు రావాలని ఆహ్వానం
-త్వరలో నూతన ఫిల్మ్ పాలసీ తెచ్చే దిశగా చర్యలు చేపట్టామన్న మంత్రి దుర్గేష్
-రాబోయే 5 ఏళ్ల కాలంలో పర్యాటక రంగంలో ఏపీని అగ్రగ్రామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా వివరించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్ లు, యాంకర్ హబ్ లు తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకాన్ని వృద్ధి చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు పీ4 విధానంలో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో 27 జనవరి, 2024న విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో ఉదయం 10 గంటలకు రీజినల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్ మెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం పాత 5 జిల్లాలకు సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ఆసక్తి ఉన్న వారు పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 150 మంది ఇన్వెస్టర్లకు ఆహ్వానం పంపించామన్నారు. మధ్యాహ్నం నుండి ఉత్తరాంధ్ర ప్రాంత శాసనసభ్యులందరూ, ఇతర నాయకులు వారి వారి ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వివరాలను తెలుసుకునేందుకు, ప్రతిపాదనలు స్వీకరించేందుకు సమావేశం ఏర్పాటుచేశామన్నారు. సాయంత్రం ఇన్వెస్టర్లతో విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడుతామన్నారు.. వారి ఆసక్తులను వింటామన్నారు. సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి దాదాపు 15 మందితో ఎంవోయూ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇప్పటికే డిసెంబర్, 2024లో విజయవాడలో హోటల్ వివంతలో టూరిజం సమ్మిట్ ఏర్పాటు చేసి దాదాపు 200 మంది ఇన్వెస్టర్ల నుండి ప్రతిపాదనలు స్వీకరించామన్నారు. కొన్ని కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.

త్వరలోనే ఫిబ్రవరిలో టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మిట్ ల ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి గల అవకాశాలను వివరిస్తామన్నారు. ఇన్వెస్టర్లు సరైన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ల్యాండ్ పాలసీలు అందుబాటులో ఉంటే ఇవ్వడం లేదంటే ఇన్వెస్టర్ల వద్దే ల్యాండ్ ఉంటే వాటికి సింగిల్ విండో విధానంలో రాయితీలు కల్పిస్తామన్నారు.

పెట్టుబడులకు ముందుకొచ్చిన తాజ్, ఒబెరాయ్, మేఫేర్, ఐఆర్ సీటీసీ: మంత్రి దుర్గేష్

తాజ్, ఒబెరాయ్, మేఫేర్, ఐఆర్ సీటీసీ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఐఆర్ సీటీసీ తో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. ఒబెరాయ్ సంస్థ రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే పిచ్చుక లంక ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. బోర్డు మీటింగ్ అనంతరం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు వారు ముందుకొస్తారని వివరించారు.

త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్ : మంత్రి దుర్గేష్

తొలుత మారేడుమిల్లి ఉత్సవ్ ప్రారంభించి స్థానికంగా ఉన్న అవకాశాలను ఇన్వెస్టర్లకు తెలిపి తద్వారా మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రంపచోడవరం, మారేడుమిల్లిలు అటవీ ప్రాంతాలని అక్కడ అభివృద్ధి చేయాలంటే ఆయా శాఖల అనుమతులు తప్పనిసరి కావడంతో ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తద్వారా పర్యాటకాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు.
అరకు సమీపంలోని టైడా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖతో సమస్య వస్తే ఉప ముఖ్యమంత్రి,అటవీ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా సబ్ కమిటీలో చర్చించి సంబంధిత ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు క్లియరెన్స్ ఇప్పించారన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టును పట్టాలెక్కించామన్నారు.

పర్యాటకుల భద్రతే మా ప్రాధాన్యత: మంత్రి దుర్గేష్

గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా పాపికొండల టూర్ విషయంలో భద్రతా ప్రమాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. పాపికొండలు యాత్రను మరింత మెరుగుపర్చనున్నామన్నారు.. పర్యాటకుల భధ్రత తమ తొలి ప్రాధాన్యమన్నారు..

ప్రపంచవ్యాప్తంగా టూరిజం కాన్ క్లేవ్ లు ఏర్పాటుకు సన్నాహాలు: మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో గతేడాది ఆంధ్రప్రదేశ్, వియత్నాం టూరిజం కాన్ క్లేవ్ జరిగిందని, మలేషియా, కెనాడా దేశాల నుండి ఇన్వెస్టర్లు వచ్చారని గుర్తుచేశారు.. రాబోయే రోజుల్లో ఏపీ టూరిజం శాఖతో సమన్వయం చేసుకొని ప్రాజెక్టులు చేపట్టాలని ఆసక్తిగా ఉన్నారన్నారు. ఇతర దేశాల్లో కూడా టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించి రాష్ట్ర పర్యాటక వృద్ధికి పెట్టబడులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో పర్యాటక రంగంలో ఏపీని అగ్రగ్రామిగా నిలబెట్టి తీరుతామన్నారు.

పర్యాటక రాజధానిగా అమరావతి: మంత్రి దుర్గేష్

అమరావతి రాజధాని ప్రాంతంలో రివర్ ఫ్రంట్ ను పర్యాటక అభివృద్ధికి కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారని, ఇందుకు సీఎంకు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో రూ.500 కోట్లతో భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుడతామన్నారు.

టూరిజం సర్క్యూట్ లు, యాంకర్ హబ్ లకు కేంద్రంగా ఏపీ: మంత్రి దుర్గేష్

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం మాత్రమే అధికంగా ఉందని త్వరలోనే అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, టెంట్ టూరిజంలను వృద్ధి చేసేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో పురాతన మండువా లోగిళ్లను అద్దెకు తీసుకుని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి రిలీజియస్ టూరిజం దిశగా అడుగులు వేస్తామన్నారు.

సింగిల్ విండో విధానంలో పర్యాటక ప్రాజెక్టులకు అనుమతులు: మంత్రి దుర్గేష్

ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలుసుకొని ఆ దిశగా కూడా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అఖండ గోదావరి ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు : మంత్రి దుర్గేష్

కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ ద్వారా మంజూరైన రూ. 177 కోట్లతో అఖండగోదావరి, గండికోటలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా పర్యాటక కేంద్రమైన రాజమహేంద్రరంలో రూ.98 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టామన్నారు. రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి పనులు పట్టాలెక్కిస్తామన్నారు. అందులో భాగంగా పూర్తిగా అధ్యాత్మిక వాతావరణం తలపించేలా పుష్కర్ ఘాట్ ను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.. నిడదవోలు కెనాల్ ను ఆధునికీకరించి ఒకవైపు రెస్టారెంట్లు, మరోవైపు రిసార్ట్స్ లతో అభివృద్ధి చేస్తామన్నారు. అదే విధంగా ప్రఖ్యాతిగాంచిన కోట సత్తెమ్మ ఆలయాన్ని ఆధునికీకరించి వసతి సౌకర్యాలు పెంచి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ప్రధానంగా ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరిస్తాం..2.7 కి.మీ వంతెనపై ఒక్కొక్కటి 48 మీటర్ల విస్తీర్ణంలో 57 స్పాన్ లకు గానూ 18 స్పాన్స్ పై పర్యాటక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అన్ని ఘాట్లను కలిపేలా బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కడియం నర్సరీని మరింత అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేందుకు థీమాటిక్ జోన్ లు, వాటర్ స్పోర్ట్స్ లు, క్యాస్కేడింగ్ ఫౌంటెన్ డిజైన్లు, లైట్ అండ్ సౌండ్ షోలు, జలపాతాలు, గాజు వంతెనలు , ట్రెజర్ హంట్స్, వీడియో గేమ్స్, ఇంటరాక్టివ్ ఫన్, గేమింగ్ జోన్ లు ఏర్పాటుచేస్తామన్నారు. అంతేగాక ప్లానిటోరియం స్పేస్ థీమ్, క్రాఫ్ట్ బజారులు, హ్యాంగింగ్ గార్డెన్ లు, హాలో గ్రామ్ జూ, ఏఐ టెక్నాలజీతో టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్, బఫర్ స్పేస్ లు, టాయ్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. బ్రిడ్జిలంక ఐల్యాండ్ లో ఈవెంట్ స్పేస్ లు ఏర్పాటు చేసి తపోవనం పేరుతో అభివృద్ధి చేస్తామన్నారు.

చారిత్రక ప్రాశస్త్యం దెబ్బతినకుండా గండికోట అభివృద్ధి: మంత్రి కందుల దుర్గేష్

చరిత్రాత్మకమైన గండికోటను అద్భుత రీతిలో తీర్చిదిద్దనున్నామన్నారు. చారిత్రక ప్రాశస్త్యం కోల్పోకుండా గండికోటను పూర్తిగా ఆధునికీకరించి, వసతి కల్పనతో పాటు సహజ ప్రకృతి సౌందర్యాలను తిలకించే విధంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. టెండర్లు ఇప్పటికే పిలిచామన్నారు.

అదే విదంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రూ. 100 కోట్లతో సూర్యలంక బీచ్ ను మరింత సుందరంగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇప్పటికే డీపీఆర్ లు కేంద్రానికి పంపించామన్నారు. అన్నవరంలో రూ.25 కోట్లతో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరై టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అహోబిలం, నాగార్జున సాగర్ దగ్గర ఒక్కొక్కటి రూ.25 కోట్లకు ప్రతిపాదనలు పంపించామన్నారు.

స్వదేశీ దర్శన్ 2 క్రింద ఈ ప్రాజెక్టులకు డీపీఆర్ లు పంపించామని కేంద్రం వెంటనే ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. అనంతరం కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఢిల్లీలో ఒకసారి కలిశానని, బెంగుళూరులో జరిగిన కాన్ క్లేవ్ లో మళ్లీ కలిసి ఏపీ ప్రాజెక్టులను ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఆయన సంపూర్ణ సహకారంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాన్నిహిత్యంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారన్నారు.

పరిశ్రమకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకానికి కూడా వర్తింపు : మంత్రి కందుల దుర్గేష్

టూరిజంకు పరిశ్రమ హోదా కల్పించడం,జీఎస్టీ, విద్యుత్ ఛార్జీలు తదితర పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు ఇస్తుండటంతో వందల సంఖ్యలో పర్యాటక పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు. నూతన పర్యాటక పాలసీ 2025 -29 తీసుకువచ్చామని తద్వారా పర్యాటక కేంద్రాలను యాంకర్ హబ్ లుగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒక రోజు కోసం వచ్చే పర్యాటకులు కనీసం 3 -5 రోజులు పర్యాటక ప్రాంతంలో గడిపేలా తద్వారా ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఉదాహరణకు సింహాచలం లక్ష్మీ నర్సింహ్మస్వామి దర్శనానికి వచ్చే పర్యాటకుడు సమీపంలోని బ్లూఫాగ్ సర్టిఫికెట్ పొందిన రుషికొండ బీచ్ ను సందర్శించేలా, అరకు వ్యాలీ సందర్శించేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బొర్రా గుహల ఆధునికీకరణకు నిధులు మంజూరు అయ్యాయయన్నారు. అదే విధంగా శ్రీశైలం వచ్చే పర్యాటకుడు స్థానికంగా ఉండే రోప్ వే, టైగర్ రిజర్వ్, వాటర్ ఫాల్ చూసే విధంగా, వసతి కోసం రిసార్ట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గడిచిన ఐదు ఏళ్లలో కుంటుపడిన పర్యాటకాభివృద్ధిని పట్టాలెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం: మంత్రి కందుల దుర్గేష్

గడిచిన ఐదు ఏళ్లలో కుంటుపడిన పర్యాటకాభివృద్ధిని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ మంత్రిగా శాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానన్నారు. పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *