గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్న క్యాంటీన్ల వద్ద లైట్లు, ట్యాప్ లు సక్రమంగా ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుట్టగుంట క్యాంటీన్ వద్ద ఫ్లోర్ కుంగిన ప్రాంతాల్లో మరమత్తు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు.
