విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే ప్రతీ ఖర్చును లెక్కిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల్లో బాగంగా ఎన్నికల వ్యయ నిర్వహణపై అధికారులు, మార్కెట్ ఏజెన్సీ ట్రేడర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తన ఛాంబర్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును లెక్కించడం జరుగుతుందని చెప్పారు. దీని కోసం ప్రతి నియోజకవర్గానికి వ్యయ పరిశీలకులు అభ్యర్థులు చేసే ఖర్చులను పర్యవేక్షిస్తారన్నారు. ప్రత్యేక బృందాలను కూడా నియమించామని, వీడియో రికార్డింగ్ కూడా చేస్తామని తెలిపారు. ఖర్చులకు సంబంధించిన అంశాలను వివరించారు. సభలు, సమావేశాలు సమావేశాలు నిర్వహించేటప్పుడు వినియోగించే షామియానా, డయాస్, వాహనాలు, సమావేశ మందిరాలు, మైక్ సెట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, రాలీ నిర్వహణ, భోజనాలు ఇతర ఖర్చుల వివరాలను వెల్లడించారు. మార్కెట్లో ఉన్న ధరల ఆధారంగానే వీటిని నిర్ణయించడం జరిగిందని, ఈ ధరలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిరోజు నిర్వహించిన రోజువారీ ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు వ్యయ పరిశీలకులకు అందించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సిహెచ్ ఆషారాణి, డీఎస్ఓ జి. మోహన్ బాబు, డిఐపి ఆర్ఓ యు.సురేంద్రనాథ్ ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పిఎన్ కృష్ణ చైతన్య, ఎంవిఐ కె. వెంకటేశ్వర్రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వై ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్సిపి) డివి కృష్ణ (సిపిఐ ఎం) ఉన్నారు.
Prajavartha Online Telugu News