మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం ఆర్డీవోలు తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓ లు, వీఆర్వోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్ డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో భూ సమస్యలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున హెల్ప్ డెస్క్ మాదిరిగా అర్జీల స్వీకరణకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఫిజికల్గా రసీదు ఇవ్వాలన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహించుటకు ఎంఈఓలు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు కలిసి ప్లాన్ చేయాలన్నారు. సింగిల్ టీచర్స్ పాఠశాలలకు తగిన సహకారం అందించాలన్నారు.
ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అందించాలన్నారు. తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు పరిస్థితి వివరించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన బ్యాక్ డ్రాప్ మాత్రమే వినియోగించాలని, ఎవరి ఫొటోస్ ఉండరాదని సూచించారు, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ఆ గ్రామం యొక్క మ్యాప్ డిస్ప్లే చేయాలని, నిర్దేశిత ఫారాలలో రోజువారి నివేదికలు సమర్పించాలన్నారు.
డి ఆర్ వో కె చంద్రశేఖర రావు వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ సదస్సులు నిర్వహణపై మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు నిర్వహణ సంబంధిత ప్రొఫార్మాలు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. రెండు రోజుల ముందుగానే గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా, లోకల్ మీడియాలో ప్రచారం నిర్వహించాలన్నారు. ఆ గ్రామానికి సంబంధించి ఎన్ని అర్జీలు వస్తాయో తగిన సంఖ్యలో దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సర్వీసెస్ లేదా గ్రీవెన్స్ పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహణ సందర్భంగా గ్రామ సభ వద్ద గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కౌంటర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రీవెన్స్ పిజిఆర్ఎస్ పోర్టల్ లో రెవెన్యూ సదస్సుల మెనూలో నమోదు చేయాలన్నారు. గ్రామసభల వద్ద తాగునీరు, టెంట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వీఆర్వోలను ఎడ్యుకేట్ చేయాలన్నారు. వాటర్ టాక్స్ డిమాండ్ రిజిస్టర్, లేటెస్ట్ అడంగల్, కూడా సంబంధిత రికార్డులు సిద్ధంగా ఉంచాలన్నారు. రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ముగిసినప్పటికీ ఇందులో వచ్చిన అర్జీలు పరిష్కారం అయ్యేదాకా ఫాలో అప్ చేయాలన్నారు. ట్రూ స్పిరిట్ తో కార్యక్రమాలు జరిగేలా నిర్వహించాలన్నారు. జిల్లాలో 497 పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద పంచాయతీలలో రెండవ రోజు కూడా నిర్వహించవచ్చు అన్నారు. సదస్సులలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, తొలిరోజు వారిచే ప్రారంభింప చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుడివాడ డివిజన్ గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభిస్తారని డిఆర్ఓ తెలిపారు.
రెవెన్యూ సదస్సుల గురించి లోకల్ మీడియాలో వైడ్ పబ్లిసిటీ ఇవ్వడంతో పాటు పరిష్కరించిన వాటికి సంబంధించిన విజయ గాధలు మీడియాకు పంపాలన్నారు. అందుకు సంబంధించిన రోజువారి ప్రెస్ క్లిప్పింగ్స్, సదస్సులు నిర్వహణ ఫోటోలు పీజిఆర్ఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. రెగ్యులర్గా సచివాలయాల ద్వారా అందించే పౌర సేవలకు నిర్దేశించిన రుసుము ఉంటుందని, కానీ రెవెన్యూ సదస్సులలో ఈ రుసుమునకు మినహాయింపు ఇచ్చారని, ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా సేవలందించాలన్నారు.
Prajavartha Online Telugu News