-సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్
-విజన్ డాక్యుమెంట్ పుస్తకం పై సంతకం చేసిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. పది సూత్రాలు – ఒక విజన్ తో రూపొందిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చారిత్రత్మకమైన ఘట్టమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపి కేశినేనిన శివనాథ్ పాల్గొన్నారు. సభా ప్రాంగణానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపి కేశినేని శివనాథ్ మంత్రులు, అధికారులతో కలిసి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన అనంతరం ఆ విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లతో పాటు ఎంపి కేశినేని శివనాథ్ కూడా సంతకం చేశారు.
ఈ సభా ప్రాంగణం దగ్గర ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ -2047లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. 2047నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు కానున్న సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కి పిలుపు నిచ్చారని తెలిపారు. 2047కి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టడమే వికసిత్ భారత్ ధ్యేయమన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామర్ధ్యంతో దేశ ప్రగతి, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ది సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లాంటి యువ నాయకుల భాగస్వామంతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం ఖచ్చితం సాధ్యమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రజలు కూడా భాగస్వాములుగా మారి కృషి చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News