– గ్రామ, వార్డు సచివాలయం వారీగా నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
– విస్తృత జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలుచేసే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన ప్రత్యేక ర్యాలీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్‌పై కలెక్టర్ లక్ష్మీశ.. వెండర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీలోగా మరో 1,100 యూనిట్ల గ్రౌండింగ్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు, వెండర్లు సమన్వయంతో పనిచేసి యూనిట్ల ప్రారంభానికి ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలన్నారు. పథకంపై గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా అవగాహన ర్యాలీల నిర్వహణకు ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ర్యాలీల్లో సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. అదేవిధంగా కాలేజీ, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మానవ హారాలతో పథకంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు కూడా ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. సచివాలయ సిబ్బందికి పోస్టర్లు, బ్యానర్లు అందజేయాలని ఏపీసీపీడీసీఎల్ అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద ఆదర్శ గ్రామపంచాయతీలుగా ఎంపికైన పరిటాల (కంచికచర్ల), వెల్వడం (మైలవరం); బూదవాడ, ఎస్ఎం పేట (జగ్గయ్యపేట), కంబంపాడు (ఎ.కొండూరు)లో 100 శాతం కనెక్షన్లు ఏర్పాటుకు అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీ మోహన్, ఇన్‌స్టలేషన్స్ వెండర్లు తదితరులు పాల్గొన్నారు.