– ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల, ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి…..
– రాష్ట్ర విద్యాశాఖ ప్రాంతీయ సదస్సులో డైరెక్టర్ వి.విజయరామరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకెళ్తోందని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు అన్నారు. స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మానవ వనరుల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో నూతన విద్యా విధానంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ సదస్సులో డైరెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసేందుకు మానవ వనరుల విభాగంలో భాగస్వామ్యం అయిన మేధావి వర్గంతో అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రమేయం చాలా అవసరమన్నారు. అందుకు తగిన విధంగా ఆయా సమన్వయ శాఖల అధికారులతో వర్క్ షాప్ ఏర్పా టు చేశామన్నారు. నూతన ప్రతిపాదిత విద్యా విధానంలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, హైస్కూల్ పాఠశాలల ఉన్నతీకరణ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాలో క్లస్టర్లు ఏర్పాటు, ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 25 పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీటిలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వారి అభిప్రాయాలను సమీకరించి ఒక సమగ్ర అధ్యయన నివేదిక రూపొందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు ప్రతి పాదనలు చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డా. జి.లక్ష్మీశ, పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి.నాగమణి, ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల డీఈవోలు యు.వి. సుబ్బారావు, పి.వి.జె.రామారావు, స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.