గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన, అంతర్గత రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఏఈల వారీగా ప్యాచ్ వర్క్ లపై భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను, జిఎంసి వెహికిల్ షెడ్ లో పారిశుధ్య పనులకు అవసరమైన సామాగ్రిని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు రోడ్లకు ప్యాచ్ వర్క్ లను చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నూతన రోడ్ల ఏర్పాటుకు ముందే డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ప్యాచ్ వర్క్ లను నామమాత్రం కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేసేలా ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. వెహికిల్ షెడ్ లో పర్యటించి, పారిశుధ్య పనులకు అవసరమైన కాల్వ పారలు, దంతేలు, బిన్లను వార్డ్ ల వారీగా డిమాండ్ కి తగిన విధంగా తెప్పించామన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు వాటిని తీసుకెళ్ళి వార్డ్ ల్లో మరింత మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బాలాజీ నగర్ లో పలు అభివృద్ది పనులను పరిశీలించి, శివారు ప్రాంతాల్లో డ్రైన్ల ఏర్పాటుపై ఇంజినీరింగ్ అధికారులు, పారిశుధ్య పనులపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏటి అగ్రహారంలో త్రాగునీటి శ్యాంపిల్ తీసి క్లోరిన్ శాతాన్ని తనిఖీ చేసి, ప్రతి రోజు ఎమినిటి కార్యదర్శులు సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తీయాలని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ మధుసూదన్, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
