-145 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి
-పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యార్థులు 8:30 గంటలకే వారి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,770 మంది బాలురు, 10,571 మంది బాలికలు కలిపి మొత్తం 22,341 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. పగడ్బందీ పరీక్షల నిర్వహణ నిమిత్తం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, కస్టోడియన్, స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎవరికీ పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్లు, ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, ఇది ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో పరీక్షలు ప్రతిరోజూ జరిగేవన్నీ అయితే, ఆయా తేదీలలో నిర్వహించే పరీక్షల మధ్య ఒకరోజు సెలవు (గ్యాప్) ఇవ్వడం ద్వారా విద్యార్థి తరువాత రాసే పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రణాళిక రూపొందించిందని, తద్వారా విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచే అవకాశం ఉందన్నారు.
మార్చి 17వ తేదీన తెలుగు భాష, 19న హిందీ, 21న ఆంగ్లం, 22న ఓరియంటల్ ఎగ్జామ్, 24న గణితం, 26న భౌతిక శాస్త్రం, 28న జీవశాస్త్రం, 29న ఒకేషనల్ కోర్సు (లాంగ్వేజ్), 31 లేదా ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు సమాంతరంగా 23 పరీక్షా కేంద్రాలలో ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా జరుగుతాయని, మొత్తంగా 1,087 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యేంతవరకు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే విధంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.