మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించి గంగపుత్రులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయలు చొప్పున మెగా బ్యాంకు చెక్కును అందజేశారు.
అదేవిధంగా జిల్లా స్థాయిలో నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్లో జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి 13,077 మంది మత్స్యకారులకు సంబంధించి 26,15,40,000 రూపాయల మెగా బ్యాంకు చెక్కును పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మత్స్య సంపద సంరక్షణకు సముద్ర తీరంగల ప్రాంతాల్లో ప్రతి సంవత్సరము ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధం విధించబడిందన్నారు.
జిల్లాలో మచిలీపట్నం, కోడూరు,నాగాయలంక, కృత్తివెన్ను మండలాలు తీర ప్రాంత మండలాలుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత గల మత్స్యకారుల గణన చేపట్టడం జరిగిందని, 2,263 బోట్లు ఉన్నాయని 13,331 మంది మత్స్యకారుల పేర్లను అప్లోడ్ చేయగా అందులో 13,077 మందిని ఈ సంవత్సరానికి వేట నిషేధ భృతికి అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ఆ ప్రకారం జిల్లాలో 26 కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య సంపద యోజన పథకాన్ని మరో సంవత్సరం పొడిగించిందని ఆ పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్నమెంటల్ ఫిషింగ్ అధ్యయనం కోసం తమిళనాడుకు కొందరు మత్స్య శాఖ అధికారులను, మత్స్యకారులను పంపామని వారి నుండి నివేదిక అందాక మత్స్యకారులందరూ వారి బంగారు భవిష్యత్తు కోసం ఆ దిశగా ముందుకు రావాలన్నారు. అంతేకాకుండా మత్స్యకారులు దళారుల బారిన పడకుండా ఉండేందుకు ఎఫ్ పి ఓ లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. గతంలో తమ ప్రభుత్వం చేపల వేట నిషేధ కాలంలో 4 వేల రూపాయలు మత్స్యకారులకు అందజేసిందన్నారు. ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రెట్టింపు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటిచ్చారని, ఆ మాటను నిలబెట్టుకుంటూ ఒక్కో కుటుంబానికి 20వేలకు పెంచిన నిషేధకాల భృతిని ముఖ్యమంత్రి నేడు శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258.356 కోట్ల రూపాయలను నిషేధకాల భృతి కింద ముందుగానే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దీంతో మొత్తం 1,29,178 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
మత్స్యకారులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహించి మత్స్యకారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు తోడ్పాటు అందించాలని కోరారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు:
—————————
1. సైకం ఆంజనేయులు గిలకలదిండి మచిలీపట్నం మాట్లాడుతూ ఈరోజు తమకు పండుగ దినమన్నారు.
చేపల వేట తమ జీవన ఆధారమని వేట నిషేధ కాలంలో ఇబ్బంది పడకుండా పదివేల గతంలో ఇస్తున్న నిషేధభృతి 10 వేల రూపాయలను నూతన ప్రభుత్వం 20వేల రూపాయలకు పెంచి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
2. వాడపల్లి రమేష్ గిలకలదిండి , మచిలీపట్నం మాట్లాడుతూ 2014లో అప్పటి ప్రభుత్వం మత్యకారుల కష్టాలను గుర్తించి 50 సంవత్సరాలు నిండిన వారికి 2000 రూపాయలు పింఛను మంజూరు చేసిందని మరల ఆ ప్రభుత్వమే పింఛను 4వేల రూపాయలకు పెంచిందన్నారు. మత్స్యకారులు కోస్తా తీరంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి అప్పట్లో బియ్యం మాత్రమే ఇచ్చేవారని, తర్వాత 4000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 వేల రూపాయలకు పెంచి వేట నిషేధ భృతిని ఇవ్వడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఉపముఖ్యమంత్రి కి రాష్ట్ర మంత్రి కొలు రవీంద్రకు మత్స్యకారులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఐ నాగరాజు డిడి సిహెచ్ ప్రసాదు ఏడి రమేష్ ఎఫ్డిఓ లు ప్రతిభ, సత్యనారాయణ ,మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాదు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News