-అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు
-వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారు
-10వేల మంది కార్మికుల పొట్ట కొట్టారు
-జగన్ చేసిన వినాశనం గురించి తెలిసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారు
-ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం
-మంగళగిరి నియోజకవర్గం బేతపూడి గ్రామంలో నర్వ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ పనులకు రెండోసారి శంకుస్థాపన చేయరని, అయితే జగన్ చేసిన దుర్మార్గాలు తెలుసుకొని, నష్టపోయిన రైతులకి అండగా నిలబడటం కోసం మళ్లీ వస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన కోసం ఆయన సమయం వెచ్చించి అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో సోమవారం మంగళగిరి నియోజకవర్గం బేతపూడి రామాలయం సెంటర్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలంటూ రాజధాని రైతులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని. అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేనట్టే. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉన్నట్లు మనకు ఒక బలమైన రాజధాని అవసరం.
అమరావతి విషయంలో జగన్ ఎన్నో పాపాలు చేశారు
విడిపోయిన రాష్ట్రానికి హైదరాబాద్ నగరం లాంటి బలమైన రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంచుకున్నారు. ఆయన పిలుపు మేరకు 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. భూములు ఇచ్చిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీని జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. జగన్ ముఖ్యమంత్రి కాగానే మూడు రాజధానుల పేరుతో అమరావతిని ప్రణాళికబద్ధంగా నిర్వీర్యం చేశారు. ఇక్కడ నిర్మించిన రోడ్లను తవ్వేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చిన కంకర, గ్రావెల్ ను అక్రమంగా తరలించుకుపోయి అమ్ముకున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు పారిపోయేలా వ్యవహరించారు. జగన్ దుర్మార్గపు పనుల వల్ల దాదాపు 10 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇంగితం ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా వ్యవహరించరు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో గత ఐదేళ్లు మనం చూశాం.
మీరు నిలబెట్టిన కూటమే ఇది
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని రైతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని తప్పులకు కేసుల్లో ఇరుక్కున్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అలుపెరుగని పోరాటం చేశారు. ప్రతి రోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత మహిళలు దాదాపు 200 మంది జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చి వపన్ కళ్యాణ్ ఎదుట తమ సమస్యలు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఆ మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలకు కలిసి రాజధాని ప్రజలు పడుతున్న కష్టాలు వివరించారు. స్వయంగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని వైసీపీ నాయకులు ఎలా నాశనం చేస్తున్నారో వివరించారు. ఆనాడు రాజధాని రైతులు పెట్టిన కన్నీరే రాష్ట్రంలో కూటమి ఏర్పడ్డానికి కారణం అయ్యింది. 2024లో కూటమి ఘన విజయం సాధించడానికి తోడ్పడింది.
అపోహలు వద్దు… అదంతా ప్రచారం మాత్రమే
రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు కాకుండా మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండి. కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంది. సీఆర్డీఏ పరిధిలోనే రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరాల కోసం భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం గానీ, ఆదేశాలుగానీ ఇవ్వలేదు. దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్లు ఒకటో తేదీనే అందిస్తున్నాం. ప్రతి నెల దాదాపు 60 లక్షల మందికి రూ. 2700 కోట్లు పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు రూ.1674 కోట్లు బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే బకాయిలు చెల్లించాం. 10 వేల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశాం. బేతపూడిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, కళ్యాణ మండపం నిర్మాణం, శ్మశాన వాటిక అభివృద్ధి గురించి అడిగారు. కచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం. స్థానిక ప్రజలకు రాజధాని నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల చేతుల మీదగానే రాజధాని నిర్మాణం జరగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బేతపూడి విజయ్ శేఖర్, గంజి చిరంజీవి, బడే కోమలి, వాసా శ్రీనివాసరావు, అడపా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News