-ఆర్ ఎమ్ సి శాఖాధిపతులతో సమీక్షలో కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్ ఎమ్ సి వివిధ విభాగాల అధికారు లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నగరపాలక సంస్థ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతే, ఆ నగర అభివృద్ధి లో గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. గత ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా రూ.88 కోట్లు వసూలైందని, ఈ ఏడాది కనీసం 10 శాతం మేర పెరుగుదల సాధించాలని సూచించారు. హౌస్ టూ హౌస్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేసి, డిమాండ్ రైజింగ్ను చర్యలు ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ చివరకు 65 శాతం వసూళ్లు సాధించేలా లక్ష్యంతో ఇప్పటి నుంచే పనిచేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, ఆమేరకు అభివృద్ధిని ప్రజలకు చూపించాలన్నారు. రోడ్ల నిర్మాణం, అందుకు సమాంతరంగా డ్రెయిన్ టూ డ్రెయిన్ పనులు జరగాలని సూచిస్తూ, పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు త్వరగా పూర్తి అయ్యేలా వినిమయ నివేదికలను అందచేయాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్ష సందర్భంలో లిక్విడ్ వెస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణం డిశెంబరులో పూర్తవుతుందని ఎస్ఈ పేర్కొన్నారు. సి అండ్ డి వేస్టును ప్రజలు మునిసిపాలిటీ గుర్తించిన ప్రదేశాలలో మాత్రమే పడవేయాలని, ఈ విషయమై సచివాలయ సిబ్బంది ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఆమేరకు పర్యవేక్షణా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై చర్చిస్తూ, లబ్ధిదారుల నుంచి ఆహార నాణ్యత, రుచి, శుభ్రతపై అభిప్రాయాలు ఎప్పటి కప్పుడు సేకరించాలని అధికారులకు తెలిపారు. అనంతరం శానిటేషన్, డీసిల్టేషన్ పనులపై పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. వీధి వ్యాపారుల జీవనోపాధి భద్రతగా ఉండేలా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని టౌన్ ప్లానింగ్ శాఖను ఆదేశించారు. రోడ్లపై అక్రమ వ్యాపారాలు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తున్నాయన్న విషయం తమ దృష్టికి వొచ్చిందన్నారు. అలాంటి వాటికి సంబంధించి లైసెన్సులను రద్దు చేయాలని, పర్యవేక్షణ చెయ్యడం లో అలక్ష్యం వహిస్తున్నా వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నగరపాలక సంస్థ సేవలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, ఎస్ఈ ఎం.సీహెచ్. కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ వి. వినూత్న, రెవెన్యూ అధికారులు సీహెచ్. శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎం.డి. అబ్దుల్ మాలిక్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు, సీఎంఎం రామలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News