-డైట్ మరియు మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలి
-సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలి
-చదువుల్లో వసతి గృహాల విద్యార్థులు మెరుగైన పనితీరు కనబరిచేందుకు మూడు గ్రూపులుగా వర్గీకరించాలి
-సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై విద్యార్థుల తల్లితండ్రుల్లో నమ్మకం పెంచాలి
-:రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ వసతి గృహాల్లో 100 శాతంఅడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. సంక్షేమ వసతి గృహాల్లో 100 శాతం అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డైట్ మరియు వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు.సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జిల్లా సాంఘిక సంక్షేమ సహాయ సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులు తమ చదువుల్లో మెరుగైన పనితీరు కనబరిచేందుకు మూడు గ్రూపులుగా వర్గీకరించాలన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులు అందరూ దోహదపడాలని మంత్రి సూచించారు .వసతి గృహాల మరమత్తుల నిమిత్తం రూ. 143 కోట్లు, నూతనంగా నిర్మించే హస్టల్ భవనాలకు రూ. 100 కోట్లకు పైగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు విడుదల చేశామన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు.అలాగే వసతుల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో అహ్లదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హస్టల్ భవనాలు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో మెనూలో నాణ్యమైన బియ్యం అందిస్తున్నా మన్నారు.ఇంటర్ లో, పదవ తరగతిలో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించామన్నారు. మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవడటంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి చేర్చడానికి రీజనల్ వర్క్ షాపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్ అందిస్తామన్న నమ్మకం తల్లితండ్రుల్లో కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. హస్టల్ లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మంచి భోజనం ఏర్పాటు చేయాలని, వసతి సౌకర్యాలు బాగుండాలని ఆదేశించారు. రీజనల్ కాన్ఫరెన్స్ లను మొదటగా విజయవాడలో, అటుపై విశాఖపట్నం,నేడు తిరుపతిలో నిర్వహించామన్నారు. సంక్షేమ వసతి గృహాలు లోని విద్యార్థులను నవోదయ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లోనూ అలాగే ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు కూడా వ్రాసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టల్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు.ఇందులో భాగంగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారిచే తన సమక్షంలో ఎంఓయు కుదుర్చుకోవడం శుభపరిణామం అన్నారు.
*
సంక్షేమ వసతి గృహాల్లో జరగరాని సంఘటనలు ఏవైనా జరిగితే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు వీలుంటుందన్నారు. ఆడపిల్లల హాస్టల్ లో అత్యవసర మరుగుదొడ్లను హాస్టల్లోపలే ఏర్పాటు చేయాలని ,అలాగే రెండు డస్ట్ బిన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. తిరుపతిలో స్టడీ సర్కిల్ ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. తిరుపతి బైరాగి పట్టణంలో ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష పై ఎనిమిది నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని దాన్ని నేడు ప్రారంభిస్తున్నామన్నారు. వసతి గృహాల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉంటే వాటిని రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారన్నారు. హాస్టల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్ లోని వంట వారికి కూడా రెండు రోజులపాటు వంటపై శిక్షణ ఇస్తున్నామన్నారు .తమ శాఖలో కొత్త సంస్కరణలు చేపడుతున్నందున అన్ని అంశాల్లో నాణ్యమైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.*
సాంఘిక సంక్షేమ శాఖప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ..సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖ అధికారులు వారి ఆధీనంలోని హాస్టలను అనునిత్యం పర్యవేక్షించాలన్నారు. తద్వారా వాటి స్థితిగతులు తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. ప్రతి డిప్యూటీ డైరెక్టర్,ఇతర అధికారులు శాఖా పరమైన సమీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అద్దె భవనాలు లో నడుస్తున్న హాస్టల్లకు సంబంధించి ఆ ప్రాంతాల్లో భూములను గుర్తించాలన్నారు. ఎక్కడైనా వసతి గృహాలను మూసివేసి ఉంటే వాటిని పరిశీలించి అక్కడ 100% ఆక్యుపేషన్ ఉంటే అవసరమైన ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల నిర్వహించి సంబంధిత ఫోటోలతో సహా జేఎన్ బి నివాస్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. వసతి గృహాల వారీగా తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకుల ఫోన్ నెంబర్లను తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పనిసరిగా రాత్రి బస చేయాలన్నారు. డైట్ బిల్లులు సకాలంలో సమర్పించేలా డిప్యూటీ డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. వారు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో క్రమం తప్పకుండా మానిటర్ చేయాలన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ.. సంక్షేమవసతి గృహాల బాధ్యతలు చేపడుతున్న వారికి ఓరియంటేషన్ ఇవ్వడం ఈ సదస్సు ఉద్దేశమన్నారు రాష్ట్రంలో 1051 హాస్టల్లో ఉన్నాయని, అక్కడ విద్యార్థులకు ఉచిత బస, భోజన వసతితో పాటు విద్యను అందిస్తున్నామని, వాటిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.క్షేత్ర స్థాయి సిబ్బందిలో అవగాహన కల్పించాలని ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. 100% అడ్మిషన్లు, 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో తక్కువ బరువు ఉన్న వారిని మామూలు బరువుకు తీసుకొని వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.సంక్షేమ వసతి గ్రహాల్లోని పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు .ఏ క్వార్టర్కు ఇచ్చిన నిధులు ఆ క్వార్టర్లోపే ఖర్చు చేసేలా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఇతర అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ సుధ ఆ శాఖ కు సంబంధించి అనంతపురం,చిత్తూరు, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైయస్సార్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్మెట్రిక్ వసతి గృహ భవనాల స్థితిగతులు, నమోదు వివరాలు, విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ, వసతి గృహాల పరిశుభ్రత మరియు నిర్వహణ, అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల సంరక్షణపై మార్గదర్శకాలు, జిల్లాల వారీగా ఆరోగ్య పరీక్షల నిర్వహణ ,విద్యాభివృద్ధి మార్గదర్శకాలపై, అలాగే రాష్ట్ర స్థాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఫలితాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు .ఈ అంశాల్లో మంత్రి, ఆ శాఖకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శి, డైరెక్టర్ సదస్సుకు హాజరైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సదస్సులో సాంఘిక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారులు,ఏఎస్ డబ్ల్యూఓ లు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News