గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్య విభాగ బలోపేతం ద్వారా ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, రానున్న కాలంలో కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా మరింత మెరుగైన పారిశుధ్యాన్ని సాధించేలా విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగానికి అవసరమైన వస్తువులు, వాహనాలను పూర్తీ స్తాయిలో అందించామని, వాటిని సద్వినియోగం చేసుకున్న డివిజన్లలో ప్రజలు సంతృప్తి చెందేలా పారిశుధ్య పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే డివిజన్ల పెంపు, కార్మికులు, వాహనాల రేషనలైజేషన్, కార్మికులు, కార్యదర్శులు, అధికారుల సంయుక్త కృషి వలన పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో గుంటూరు ఉత్తమ స్థానంలో నిలిచిందన్నారు. రానున్న కాలంలో ఆ స్తానాన్ని నిలబెట్టుకోవడం, ప్రజలకు మరింత సేవలు అందేలా క్రమపద్దతిలో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి డివిజన్, సచివాలయం పరిధిలోని కార్మికులకు నిర్దేశిత విధులు కేటాయించాలని, వారికి హాజరు వేసి పనులు కేటాయించకుండా ఉండవద్దన్నారు. అలాగే ప్రతి రోజు సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళ నుండి చెత్త సేకరణ, ఎన్ని ఇళ్ళ వాళ్లు తడిపొడిగా వేరు చేసి ఇచ్చారు అనే అంశాన్ని ఏపిసిఎంఎంఎస్ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. తమ క్షేత్ర స్థాయి పర్యటనల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, ఇంచార్జి ఎంహెచ్ఓ రామారావు, ఎస్ఎస్ లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News