మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 11,316 మంది డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 16.97 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 11,316 మంది లబ్ధిదారులకు 16 కోట్ల 97 లక్షల 40వేల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. మహిళలకు శ్రీ శక్తి పథకం కింద బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించినప్పుడు ఆటో డ్రైవర్లలో ఆందోళన మొదలైందన్నారు.
ఇదివరకు గ్రామీణ ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ కార్యక్రమానికి వెళ్లాలన్న, టౌన్ లోకి రావాలన్న ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడకుండా ఆటోల్లో తిరిగేవారన్నారు. ఆ విధంగా వస్తున్న ఆదాయం తగ్గిపోతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందారన్నారు. ఉచిత బస్సు పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినప్పుడు డ్రైవర్లు పడే ఇబ్బందులను తప్పకుండా ఆలోచిస్తామని, ఆదుకుంటామని చెప్పారన్నారు. అందుకు అనుగుణంగానే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున 436 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధానంగా పనిచేస్తుందన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో చదువుకునే వారందరికీ 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతం అయిందన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ 12 నుంచి తొమ్మిది శాతం వరకు తగ్గించి పేద ప్రజలకు వస్తువులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్ వెంకటస్వామి ఆటో డ్రైవర్ల సమక్షంలో తన పుట్టినరోజును జరుపుకొని కేకును కట్ చేసి అందరికీ పంచారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రత్యేక అధికారి మార్కెటింగ్ ఏడి నిత్యానందం, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ వెంకటస్వామి, స్థానిక నాయకులు మాదివాడ రాము, సుబ్రహ్మణ్యం, గడ్డం రాజు, పలువురు, ఆటో డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News