Breaking News

బీసీల‌కు ప్రాధాన్య‌త తెలుగుదేశం పార్టీతోనే..

-ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మ‌రియు డైరెక్ట‌ర్ల ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో కూట‌మి నాయ‌కులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీతోనే బీసీల‌కు ప్రాధాన్య‌త వ‌చ్చింద‌ని తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మ‌న్ నెట్టెం ర‌ఘురాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధ‌వారం న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి గౌడ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ వీరంకి వెంక‌ట గురుమూర్తి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా ముఖ్య అతిథిగా విచ్చేసిన నెట్టెం ర‌ఘురాం మాట్లాడుతూ, బీసీల మ‌ద్ద‌తుతోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వ‌స్తుంద‌నేది చ‌రిత్ర చెబుతున్న స‌త్యం అని పేర్కొన్నారు. సాంఘికంగా, రాజ‌కీయంగా, రాజ్యాంగ‌ప‌రంగా స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం బీసీల‌కు తెలుగుదేశం పార్టీనే క‌ల్పిచింద‌ని తెలిపారు. ఆత్మాభిమానం, సాధికారిత క‌ల్పించింది నాడు దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు అని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ ఆశ‌యాల‌ను నేడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తూచ త‌ప్ప‌కుండా అమ‌లుచేస్తూ బీసీల‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని తెలిపారు. ఎక్క‌డ వెనుక‌బాటుత‌నం ఉన్నా వారికి స‌ముచిత గౌర‌వం క‌ల్పిస్తూ రాజ‌కీయ చైత‌న్యం ఇవ్వాల‌నే ధ్యేయం తెలుగుదేశం పార్టీలో మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని పేర్కొన్నారు. పార్టీలో ఒక సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉన్న నాటి నుండి మ‌రుపిళ్ళ తిరుమ‌లేశ్వ‌ర‌రావు (తిరుమ‌లేష్‌) త‌న‌కు తెలుస‌న్నారు. పార్టీ ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకిత భావం త‌న‌ను నేడు ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మ‌న్ స్థాయికి తీసుకెళ్లాయ‌న్నారు. పార్టీ ప‌ట్ల న‌గ‌రాల కుల‌స్తుల అభ్యున్న‌తి కోసం ఆయ‌న ఎంతో శ్ర‌మించేవార‌ని పేర్కొన్నారు. బీసీల అభ్యున్న‌తి కోసం అంద‌రూ అండ‌గా నిల‌బ‌డాల‌ని సూచించారు. గ‌త ప్ర‌భుత్వంలో విధ్వంసం త‌ప్పించి ఏమీ జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. విధ్వంస‌కారులు మ‌ళ్ళీ అధికారంలోకి రాకూడ‌ద‌నే ధ్యేయంతోనే తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డి ముందుకెళుతున్నాయ‌ని తెలిపారు. మ‌రో 15 ఏళ్ళ పాటు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంటేనే స‌మాజాభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మ‌న్‌గా మరుపిళ్ళ తిరుమ‌లేశ్వ‌ర‌రావుతో పాటు డైరెక్ట‌ర్లుగా నియ‌మితులైన వారితో నెట్టెం ర‌ఘురామ్ ప్ర‌మాణం చేయించారు.

కార్య‌క్ర‌మంలో గౌర‌వ అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్య‌క్షుడు, ఆర్టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ళ నారాయ‌ణ మాట్లాడుతూ, ఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌చారానికి వ‌చ్చిన సంద‌ర్భంలో మ‌రుపిళ్ళ తిరుమ‌లేశ్వ‌ర‌రావుతో తాను క‌లిసి తిరిగాన‌ని త‌నకు అప్ప‌గించిన బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంలో ఆయ‌న ఎంత‌గా కృషి చేశారో ద‌గ్గ‌ర నుండి చూశాన‌న్నారు. స‌మ‌ర్ధుడికి ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ప‌ట్ల కూట‌మి ముఖ్య నేత‌ల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సాధికార‌త క‌మిటీ ఏర్పాటు చేసి కులాల వారీగా త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతుంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్ర‌మాణం చేసిన మ‌రుపిళ్ళ తిరుమ‌లేశ్వ‌ర‌రావు (తిరుమ‌లేష్‌) మాట్లాడుతూ, త‌న‌కు ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇప్పించ‌డంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్‌(చిన్ని) పాత్ర మ‌రువ‌లేనిద‌ని పేర్కొన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర ప‌ట్టుబ‌ట్టి న‌గ‌రాల కార్పొరేష‌న్‌కు ఛైర్మ‌న్ ప‌ద‌వి విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకురావ‌డంలో ఎంపీ విజ‌యం సాధించార‌ని తెలిపారు. త‌న బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంతో పాటు జాతి అభ్యున్న‌తికి పాటుప‌డ‌తాన‌న్నారు. కార్పోరేష‌న్‌కు నిధులు కేటాయించాల‌ని ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వానికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం ముగింపు ద‌శ‌లో విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు ర‌వీంద్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌, డైరెక్ట‌ర్లుగా ప్ర‌మాణం చేసిన వారిని ఘ‌నంగా స‌త్క‌రించి అభినందించారు. కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిది కె.నాగుల్‌మీరా, రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శులు బొమ్మ‌సాని సుబ్బారావు, ఎం.ఎస్‌.బేగ్‌, వివిధ కార్పొరేష‌న్‌ల ఛైర్మ‌న్లు ఎరుబోతు ర‌మ‌ణారావు, ఈశ్వ‌ర్ ప్రేరేపి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు అడ్డూరి శ్రీరాం, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు సందీప్‌, మ‌రియు కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, న‌గ‌రాల కుల‌స్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *