మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం రహదారులపై పశువులతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన గోశాలను సందర్శించి, విధి విధానాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న పశువులను నియంత్రించేందుకు గత ఆగస్టు నెలలో పశువుల శాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 326 పశువులను పశువులశాలలో ఉంచగా, వాటిలో 269 పశువులను యజమానులు రుసుము చెల్లించి తిరిగి తీసుకెళ్లారని వివరించారు. అయితే, 16 పశువులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయినట్లు మంత్రి తెలిపారు. వాటికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో కడుపులో కుళ్లిపోయిన ప్లాస్టిక్ కవర్లు, జీర్ణం కాని ఆహారం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పశువుల శాల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, ఇందుకోసం భూముల కేటాయింపు, నిధుల విడుదల త్వరలోనే జరుగుతాయని వివరించారు. రోడ్లపై సంచరిస్తున్న పశువులను సేకరించి గోశాలలో ఉంచే చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, సహాయ మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్ స్థానిక నాయకులు లోగిశెట్టి స్వామి, కోస్తా మురళి తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News