Breaking News

సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, ప్రమాదాల నివారణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని, ముఖ్యంగా జిల్లాలోని మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నంబర్ 65, జాతీయ రహదారి 216లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రమాదాలకు నిలయమైన బ్లాక్ స్పాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన చోట్ల ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ పవర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిమార్లు చెప్పినా అమర్చకపోవడం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది సరైనది కాదని హెచ్చరిస్తూ జాతీయ రహదారులపై జరిగే హిట్ అండ్ రన్ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు.

మచిలీపట్నం నగరంలోని ప్రధాన రహదారులపై యూ టర్న్ తీసుకుని వచ్చే వాహనాలు, అదేవిధంగా ఆ వాహనాలకు ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు పరస్పరం ఢీకొని ప్రమాదాలు జరక్కుండా ఉండేందుకు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లకు బదులుగా ఎత్తు తక్కువగా ఉండే సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేయాలని, తద్వారా వాహనచోదకుడికి వచ్చే వాహనం కనిపించి ప్రమాదాలు జరక్కుండా ఉంటాయని అన్నారు. అదేవిధంగా జంక్షన్ల వద్ద పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు.

వాహనం నడిపే సమయంలో డ్రైవర్ ఫోన్ మాట్లాడటం, స్టీరింగ్ సరిగా పట్టుకోకుండా నడపటం, మగతతో వాహనం నడిపినా అప్రమత్తం చేయగల ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ సందర్భంగా డెమో ద్వారా వివరించారు. ఆయన విద్యార్థులను అభినందించి, అవసరానికి తగిన విధంగా మరింతగా అభివృద్ధి చేసి పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సురేంద్రకు సూచించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజా రవాణా అధికారికి సూచించారు.

2025 సెప్టెంబరు నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 63 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 32 మరణాలు, 47 మంది గాయాలపాలయ్యారని, అత్యధికంగా జాతీయ రహదారులపై 20, రాష్ట్ర రహదారులు 5, ఇతర రహదారులపై 7 మరణాలు సంభవించినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు వల్ల 12 మరణాలు, కార్లు, వ్యాన్లు, జీపులు వల్ల 10, లారీలు 5, ట్రాక్టర్లు వల్ల 3 మరణాలు సంభవించినట్లు తెలిపారు.

సమావేశంలో అదనపు ఎస్పి వీవీ నాయుడు, జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకట్రావు, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరులు, జాతీయ, రాష్ట్ర రహదారులు, పోలీసు తదితర శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *