మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మాతృత్వ మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారి పరిధిలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నప్పటికీ అవసరమైన వైద్య పరీక్షలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నది లేనిది ఆరా తీయాలని సూచించారు. వారు తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రత్యేక జీవనశైలి విధానంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ శేషు, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, జిజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఇతర వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News