మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్), జిల్లా పరిషత్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ), ఎంపీలాడ్స్ తదితర నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రూపొందించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని , కాంట్రాక్టర్లకు తుది బిల్లు చెల్లించేంత వరకు అధికారులదే బాధ్యతని చెబుతూ, అశ్రద్ధ చేయకుండా బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు పైపు లైన్ నిర్మాణం, మైక్రో ఫిల్టర్ల ఏర్పాటు తదితర పనులకు డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్, ఎంపీల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛభారత్ కింద జిల్లాకు మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వహణాధికారి సోమశేఖర్, మచిలీపట్నం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్, సిపిఓ భీమరాజు, గనుల శాఖ ఏడి కొండారెడ్డి, ఐసిడిఎస్ అధికారులు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News