-సెల్పీ పాయింట్స్ ను ప్రారంభించిన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
క్రికెట్ అభిమానుల ఉత్సాహానికి వేదికైన ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, శనివారం భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా సరికొత్త పర్యావరణ సందేశానికి కేంద్రంగా మారింది. స్టేడియం ఆవరణలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ భాగస్వామ్యం, జీవిఎంసి సహకారంతో కలిసికట్టుగా ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాయి.
ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ ను ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఈ సెల్పీ పాయింట్ లో పోటో దిగారు.
ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మించడం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, వారిని ఆ దిశ ప్రేరేపించడమే ఈ ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు తెలిపారు. అలాగే ఇక్కడ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు, ‘ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్’ అనే నినాదం మరింత మందికి చేరి, నగర పౌరులందరూ ఈ ఉద్యమంలో భాగం కావడానికి ప్రేరణ లభిస్తుందన్నారు.. స్వచ్ఛమైన నగరం కోసం ప్రజలను చైతన్యపరచడంలో ఈ సెల్ఫీ పాయింట్లు ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తాయన్నారు. మ్యాచ్ వీక్షించటానికి వచ్చిన క్రికెట్ అభిమానులు ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్ లో పోటో దిగటానికి ఎంతో ఆసక్తి కనబర్చారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సీ.వో.వో గిరీష్ డొంగ్రే, స్టేడియం ఇన్చార్జ్ జె.కె.ఎమ్ లతో పాటు ఏసీఏ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News