– పైప్‌లైన్ భద్రత, అత్యవసర స్పందనపై విభాగాల సమన్వయంతో సాధన
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంయుక్త ఆధ్వర్యంలో, IOCL పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) మరియు HPCL విశాఖపట్నం–విజయవాడ–సికింద్రాబాద్ పైప్లైన్ల పరిధిలో, రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ (EDMP) మాక్ డ్రిల్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ పరిధిలోని PHPL చైనేజ్ నం. 834.9 కి.మీ. మరియు HPCL చైనేజ్ నం. 200 కి.మీ. వద్ద ఈ మాక్ డ్రిల్‌ను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించారు. పైప్‌లైన్ భద్రత, అత్యవసర పరిస్థితులకు సిద్ధత, విభాగాల మధ్య సమన్వయం మరియు ప్రజల భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన లక్ష్యమని ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌లో జిల్లా యంత్రాంగంతో పాటు అత్యవసర స్పందన విభాగాల అధికారులు విస్తృతంగా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా DCIF కె. కృష్ణమూర్తి, DSP (AR) టి.వి.ఆర్.కె. కుమార్, సీతానగరం మండల రెవెన్యూ అధికారి ఎ. శ్రీనివాస్, కొరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అగ్నిమాపక, వైద్య శాఖలు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ పరిశ్రమల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ప్రదర్శిస్తూ HPCL ఇన్చార్జ్ పంకజ్ కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌లో పైప్‌లైన్‌కు సంబంధించిన అత్యవసర పరిస్థితిని అనుకరిస్తూ సంఘటన గుర్తింపు, అత్యవసర సమాచార వ్యవస్థ అమలు, ప్రదేశం వేరుచేయడం, ప్రజల సురక్షిత తరలింపు, గాయపడిన వారికి వైద్య సహాయం, అగ్నిమాపక చర్యలు మరియు విభాగాల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలను ప్రదర్శించారు. దీని ద్వారా విపత్తు నిర్వహణలో సిద్ధత స్థాయి, స్పందన వేగం మరియు అత్యవసర నిర్వహణ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన అత్యవసర చర్యలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని మిథున్ కుమార్ శీలం తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన జిల్లా పరిపాలన, వివిధ శాఖలు మరియు స్థానిక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది పూర్తిగా సాధన (మాక్ డ్రిల్) కార్యక్రమమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాలేదని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News