-‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సెర్ప్, ఏపిఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థల సమన్వయంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి, ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంబించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత మెరుగుపరచాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులు ఆదేశించారు. ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సెర్ప్, ఏపిఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థలతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమం అమలులో భాగంగా ఎంఎస్ఎంఈ, సెర్ప్, పరిశ్రమలు, ఏపిఐఐసి శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లను తక్కువ కాలంలో కార్యరూపంలోకి తీసుకురావడానికి సంబంధిత శాఖలు స్పష్టమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. స్వయం సహాయక సంఘాల (SHGs) నిర్వహణలో ఉన్న ఆదాయ సృష్టి కార్యక్రమాలను సూక్ష్మ పరిశ్రమలుగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అవసరమైన నైపుణ్య శిక్షణ, మెంటరింగ్, లాభదాయక పారిశ్రామిక అవకాశాల గుర్తింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ఎన్ఆర్ఎల్ఎం వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను సమన్వయం చేస్తూ ఎస్ హెచ్ జి ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయాలని, శిక్షణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ఉత్పత్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అనుకూల ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు మరియు సంబంధిత మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి సెర్ప్ తో సమన్వయంతో పనిచేయాలని ఏపిఐఐసి అధికారులకు సూచించారు.
జక్కంపూడిలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లో ప్రాంగణాలను లీజు ప్రాతిపదికన స్వయం సహాయక సంఘాలకు కేటాయించి, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహకారం అందించాలని సెర్ప్ అధికారులను కోరారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరిశ్రమలు & వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, సెర్ప్ కార్యదర్శి & సీఈఓ వాకాటి కరుణ, ఏపిఐఐసి వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈఓ విశ్వమనోహరన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News